Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ లపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. ఇద్దరికీ సమయం అయిపోయిందని అన్నారు. రజినీకాంత్ అయితే మూడు రోజులు షూటింగ్ లో పాల్గొంటే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. అలాగే చంద్రబాబు కూడా ప్రతీ మంగళవారం హైదరాబాద్ లోని ఆస్పత్రికి వెళ్తారంటూ చెప్పుకొచ్చారు. కావాలంటే మీరు కూడా గమనించండి.. మంగళవారం చంద్రబాబు ఎలాంటి సభలూ, సమావేశాల్లో కనిపించరని పేర్కొన్నారు.
పేదల కోసం భూమి కొనుగోలు చేసిన వైఎస్సార్, జగన్
పేద ప్రజలకు ఇళ్లు కట్టించేందు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ 400 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ గుడివాడ ప్రజల కోసం ఒక్క ఎకరమైనా కొన్నారేమో చెప్పాలని అన్నారు. వాళ్లు నిజంగానే కొన్నట్లు తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. అంతే కాకుండా మంచి నీటి ఏర్పాట్ల కోసం జగన్ మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 216 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, అలాగే వాటి ఏర్పాట్ల కోసం 200 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు ఒక్క ఎకరం కొన్నామని గానీ లేదంటే ఎకరంలో చెరువు తవ్వామని చెప్పినా తాను రాజకీయాల్లోంచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు.
రాజకీయాల కోసం కాకుండా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పని చేస్తున్నారని కొడాలి నాని తెలిపారు. ఓటు లేని పిల్లలకు ఐదు సంవత్సరాల్లో 60 వేల కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడించారు. రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో జగన్ చాలా పథకాలు తీసుకొచ్చారని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కేవలం 5200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. ఆయన పిల్లలకు చేసిందేమీ లేదని తెలిపారు. సీఎం జగన్ కు, చంద్రబాబు నాయుడు నక్కకూ నాగ లోకానికి ఉన్నా తేడా ఉంటుందని.. అసలు వాళ్లిద్దరినీ పోల్చవద్దని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గుడివాడలో తామే గెలుస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీ ఆర్టీసీలో 2013 నుంచి పని చేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వకుండా వారిని గాలికొదిలేసిన.. గాలి సీఎం చంద్రబాబు ఒక్కరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 2300 మంది కార్మికులు, డ్రైవర్లు, మెకానిక్ ల కుటుంబాలను పట్టించుకోలేదని కొడాలి నాని ఫైర్ అయ్యారు. అదే జగన్ సీఎం అయ్యాకా... కారుణ్య మరణాల కింద మృతుల కుటుంబ సభ్యులకు ఆర్టీసీలోగాని సచివాలయాల్లో కానీ ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేశారని చెప్పారు.
మనసు, జాలి, దయతో పాటు దేవుడిని నమ్మే మంచి ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడుకు మాత్రం జాలి, దయ, కరుణ వంటివి ఏవీ లేవని.. కేవలం కుటుంబం, కులం మాత్రమే అతడికి ముఖ్యమని చెప్పారు. అలాగే కొందరు మీడియా అధినేతల బాగు గురించే టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా ముఖ్యమని కొడాలి నాని ఎద్దేవా చేశారు.