Kim Jong Un's Daughter Missile Test: 



మిజైల్ టెస్ట్‌ల్లో కిమ్ కూతురు 


నార్త్ కొరియాలో పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నారు. ఒక్క అమ్మాయి తప్ప. ఆ అమ్మాయి మరెవరో కాదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూతురు. చాలా రోజుల పాటు ఆమె బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు కిమ్. గతేడాది ఓ సారి కూతురితో పాటు కనిపించాడు. ఇంటర్నేషనల్ మీడియా అంతా ఆ ఫోటోలను ప్రచురించింది. ఈమే కిమ్ కూతురు అంటూ పరిచయం చేసింది. అప్పటి నుంచి తరచూ నాన్నతో కలిసి కనిపిస్తూనే ఉంది ఆ అమ్మాయి. స్కూల్‌కెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి...నాన్నతో పాటు పక్కనే ఉండి కొత్త మిజైల్‌ టెస్ట్‌ను దగ్గరుండి చూసుకుంటోంది. ఆమె వయసెంత..? ఈ అమ్మాయి కాకుండా కిమ్‌కి ఇంకెవరైనా పిల్లలున్నారా..? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీయే. కానీ...ఈ అమ్మాయి మాత్రం రెగ్యులర్‌గా కిమ్‌తో కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. "ప్రీషియస్ చైల్డ్, రెస్పెక్టెడ్ డాటర్" అనే క్యాప్షన్‌లతో నార్త్ కొరియా మీడియా ఈ ఫోటోలు ప్రచురించింది. సౌత్ కొరియా స్పై ఏజెన్సీ చెబుతున్న వివరాల ప్రకారం ఆ అమ్మాయి పేరు జూయే. పదేళ్ల వయసు ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో, కర్లీ హెయిర్‌తో నాన్న పక్కనే నిలుచుని ఉంది. కిమ్ చేతిలో సిగరెట్ కనిపిస్తోంది. ఇద్దరూ నిలబడి మిజైల్ టెస్ట్‌ని చాలా తీక్షణంగా చూస్తున్నారు ఈ ఫోటోల్లో. ఇలాంటి మిజైల్ టెస్ట్‌ల్లో కిమ్‌ కూతురు కనిపించడం ఇది మూడోసారి. మిలిటరీ అంతా ఆమెను చీఫ్‌ గెస్ట్‌లా చూస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. గతేడాది నవంబర్‌లో ICBM లాంఛింగ్ ఈవెంట్‌లో నాన్న చేయి పట్టుకుని కనిపించింది జూయే. ఆ ఫోటో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది.