Khammam woman donate liver To Husband: కట్టుకున్న భర్త చావు బతుకుల్లో ఉన్నాడు.కలకలం కలిసి ఉంటామని చేసుకున్న బాసలు అన్నీ కళ్ల ఎదుటే కల్లలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఆ బార్య తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అర్థాంగి అనే మాటను నిజం చేసేందుకు ఆమె తన ప్రాణాలను రిస్క్ లో పెట్టుకునేందుకు సిద్ధమయింది. తన శరీరంలో ఓ భాగాన్ని భర్తకు ఇచ్చి ఆయన ప్రాణాన్ని నిలబెట్టుకుంది.
ఖమ్మం జిల్లా పెద్ద ఈర్లపూడికి చెందిన దారావత్ శీను, లావణ్య దంపతులు. వారికి పెళ్లి అయి ఎంతో కాలం అవలేదు. చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న లావణ్య పెళ్లి తర్వాత చదువుకునేందుకు శీను అంగీకరించాడు.తాను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ లావణ్యను చదివించాడు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్న సమయంలో వారికి పెను సమస్య వచ్చి పడింది. ఓ సారి కామెర్లు రావడంతో .. దారావత్ శీను గుర్తించలేదు. అహారపదార్థాలు మామూలుగానే తినడంతో అది లివర్ పై ఎఫెక్ట్ పడింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు అసలు విషయం తెలిసిపోయింది. లివర్ పూర్తిగా దెబ్బతిన్నదని దారవత్ శీను బతకడం కష్టమని తేల్చారు డాక్టర్లు. అయితే ఒకే ఒక్క ఆప్షన్ ఉందని అది లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని చెప్పడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని లావణ్య నిర్ణయించుకుంది.
ఓ వైపు భర్త చావుబతుకుల్లో ఆస్పత్రిలో ఉంటే.. మరో వైపు లావణ్య లివర్ దానం చేసే వారి కోసం చూసింది. స్వచంద్ సంస్థలు సహా అవకాశం ఉన్న సంస్థలను సంప్రదించింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన లివర్ దానం చేసేవారు దొరకలేదు. ఆర్గాన్ డొనేషన్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇప్పుడల్లా సాధ్యం కాదని తేలింది. దీంతో లావణ్య కుంగిపోయారు. అయితే ఎవరిదో ఎందుకు తన లివర్ ఇస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనకు వచ్చారు. అదే విషయాన్ని డాక్టర్లకు చెప్పారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి.. లివర్ డొనేషన్ చేయవచ్చని.. దానికి తగ్గ ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు. భవిష్యత్ లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇప్పటికైతే తన భర్తను బతికించుకోవడమే ముఖ్యమనుకున్న లావణ్య లివర్ దానం చేశారు.