Man Died In An Accident In keesara: మానవత్వం మంట గలిసింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. రక్తమోడుతూ తనను కాపాడాలని కన్నీటితో వేడుకున్నాడు. అయినా, అక్కడున్న ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అంబులెన్స్ వస్తుందిలే మనకెందుకు అనుకున్నారు. అంతే కాకుండా పోటీ పడి మరీ వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జై తీవ్ర రక్తస్రావంతో ఉన్న వ్యక్తి ప్రాధేయపడుతున్నా కనికరించకుండా అలాగే ఫోటోలు తీసుకుంటూ ఆలస్యం చేశారు. చివరకు 108 వచ్చి బాధితున్ని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హృదయ విదారక ఈ ఘటన మేడ్చల్ జిల్లా (Medchal District) కీసరలో (Keesara) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన వి.ఏలేందర్ (35) కీసర సమీపంలోని రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తోన్న ఇంటిని చూసేందుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.


రక్షించమని ప్రాధేయపడినా..


లారీ ఢీకొనడంతో ఏలేందర్ రహదారిపై పడిపోగా.. స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఏలేందర్ కాళ్లు లారీ చక్రాల కింద నుజ్జయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడిన ఏలేందర్.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడున్న వారందరినీ ప్రాధేయపడ్డాడు. అయినా ఏ ఒక్కరూ కనికరించలేదు. చుట్టూ పోగైన జనం బాధితుడిని ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఎవరో 108కు సమాచారం అందించగా.. కాసేపటికి అంబులెన్స్ వచ్చింది. ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆస్పత్రికి 108 అంబులెన్సులో బాధితున్ని తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: PPP Model Chandrababu: ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?