KFC Outlet in Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తరవాత పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. లక్షలాది మంది భక్తులు అయోధ్యకి తరలి వస్తున్నారు. ఫలితంగా...నగరమంతా మిగతా వ్యాపారాలు క్రమంగా పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుండడం వల్ల రకరకాల ఫుడ్‌స్టాల్స్ వెలుస్తున్నాయి. వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. అయోధ్యని దర్శించేందుకు వచ్చిన వాళ్లు ఇక్కడ అన్ని రకాల రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. రామ మందిరానికి కిలోమీటర్ దూరంలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే KFC కూడా ఇక్కడ ఔట్‌లెట్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే... పవిత్రమైన అయోధ్య క్షేత్రంలో KFC ఎలా పెడతారన్న వాదనలు వినిపించాయి. Panch Kosi Parikrama కి సమీపంలో ఫుడ్‌స్టాల్స్ పెట్టుకోడానికి ప్రభుత్వం అనుమతినిస్తున్నప్పటికీ మాంసాహారం విక్రయించడానికి మాత్రం వీల్లేదని తేల్చి చెప్పింది. మద్యం అమ్మకాలూ కుదరవని స్పష్టం చేసింది.
"అయోధ్యలో బడా ఫుడ్ చైన్ ఔట్‌లెట్స్ పెట్టుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేం వాళ్లని సాదరంగా స్వాగతిస్తాం. కానీ...కొన్ని కండీషన్స్ పాటించాలి. ఆ స్టాల్స్‌లో మాంసాహారం విక్రయించకూడదు. మద్యం విక్రయాలకూ వీల్లేదు"
- ప్రభుత్వ అధికారి
ప్రస్తుతానికి Parikrama Marg కి వెలుపల KFC ఔట్‌లెట్స్ ఉన్నాయి. అయోధ్య లక్నో హైవేపై అందుబాటులోకి వచ్చాయి. నిజానికి అయోధ్యలోనే ఏర్పాటు చేయాలని KFC భావించినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. శాకాహారం మాత్రమే విక్రయిస్తే KFC కూడా స్టాల్ పెట్టుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే..దీనిపై KFC ఇంకా స్పందించలేదు. రామ మందిరానికి దగ్గర్లో ఉంటేనే తమ మార్కెట్ బాగుంటుందని చాలా వరకూ సంస్థలు భావిస్తున్నాయి. రామ మందిరానికి 8 కిలోమీటర్ల దూరంలో పిజా హట్ ఏర్పాటైంది. ఇక్కడ మంచి డిమాండ్ ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.
జనవరి 23 నుంచి అయోధ్య రామాలయం (Ram Mandir in Ayodhya)లో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తొలి వారంలోనే, అది కూడా మొదటి ఆరు రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. జన్మభూమిలో రామయ్య కొలువు తీరడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ్ లల్లా పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయోధ్య బాలరాముడ్ని కనులారా చూసేందుకు, స్వామి వారి సేవలో పాల్గొనేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారని అధికారులు తెలిపారు. 23 జనవరిన 5 లక్షల మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకోగా, 24 జనవరి రోజు 2.5 లక్షలు, 25 జనవరి 2 లక్షలు, 26 జనవరి 3.5 లక్షలు, 27 జనవరి 2.5 లక్షల మంది, 28 జనవరి 3.25 లక్షల మంది అక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఈ పర్యాటకుల తాకిడి పెరుగుతూనే ఉన్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.
Also Read: మంచి పనులు చేసిన వారికి ఎప్పుడూ గౌరవం ఉండదు - నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు