Tahsildar Ramanaiah Murder : విశాఖలో కొద్దిరోజులు కిందట జరిగిన తహసీల్దార్‌ రమణయ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యను మురారి సుబ్రహ్మణ్యం గంగారావు చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యకు పాల్పడిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు వ్యవహారశైలి ముందు నుంచీ భిన్నమైనదిగా పోలీసులు చెబుతున్నారు. హత్యకు తనలోని విలన్‌ను బయటకు తీసి సుబ్రహ్మణ్యం గంగారావు.. ఈ హత్య కంటే ముందు నటించిన ఓ వెబ్‌ సిరీస్‌లోనూ విలన్‌గా నటించి తనలో దాగి విలన్‌ను ముందుగానే ప్రపంచానికి తెలియజేశారు.


వెబ్‌సిరీస్‌లో హత్య చేసినట్టే... 


ది నైట్‌ పేరుతో రెండు ఎపిస్లోడ్ల వెబ్‌ సిరీస్‌ను మురారి తీశాడు. ఇందుకు రూ.40 లక్షల వరకు ఖర్చు చేశాడు. దర్శకుడికి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం, ఇచ్చిన వాటికి ఇబ్బందులకు గురి చేయడంతో అతడు మధ్యలోనే సిరీస్‌ను వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని మురారీయే దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా ఈ సిరీస్‌లో కీలకంగా భావించే విలన్‌ పాత్రను పోషించాడు. తనలోని ముందు నుంచీ దాగి ఉన్న హింసాత్మక వ్యవహారశైలిని ఈ సిరీస్‌లోనూ చూపించే ప్రయత్నం చేశాడు మురారీ. ఈ సిరీస్‌లో మురారీ ఓ యువతి తలపై కొడతాడు. ఇందులో చేసినట్టుగానే తహసీల్దార్‌ రమణయ్యను ఇనుపరాడ్‌తో తలపై కొట్టి హత్య చేశాడు.


ఇంకా రిలీజ్ కాని వెబ్‌సిరీస్


హింస ఎక్కువగా ఉండడంతో ఓటీటీలో విడుదలకు అభ్యంతరాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఇక ఈ సిరీస్‌ను అడ్డుపెట్టుకుని పలువురిని మోసం చేశాడు మురారి. హైదరాబాద్‌లో రూ.1.80 కోట్ల మోసానికి పాల్పడిన మురారీ.. ది నైట్‌ సిరీస్‌ను వేరే నిర్మాతలకు అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ కేసులో నుంచి బయటపడే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. అలాగే, మరో రూ.70 లక్షలకు విజయవాడకు చెందిన వారిని మోసం చేసిన కేసులు మురారీపై ఉన్నాయి. మొత్తంగా రూ.2.80 కోట్ల మోసానికి పాల్పడినట్టు హైదరాబాద్‌, విజయవాడ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. 


కన్వేయెన్స్‌ డీడ్‌ వ్యవహారమే కారణం


తహసీల్దార్‌ రమణయ్య హత్యకు కన్వేయెన్స్‌ డీడ్‌ వ్యవహారమే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో సుమారు పది నిమిషాలపాటు హత్యకు ముందు తహసీల్దార్‌, జగన్‌ మురారీ మధ్య అపార్ట్‌మెంట్‌ బయట వాదనలు జరిగాయి. ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో మేనేజర్‌గా మురారి పని చేస్తుంటాడు. కంపెనీ పూర్తి పేరు వీ అని పోలీసులు వెల్లడించారు. ఈ వీఎన్‌సీ కంపెనీయే మధురవాడలో జ్యువెల్‌ పార్కు అపార్ట్‌మెంట్స్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందులోని డీ బ్లాక్‌లోలో మురారి ఉంటున్నాడు. ఇదే ప్రాజెక్ట్‌ స్థలం కన్వేయెన్స్‌ డీడ్‌ వ్యవహారానికి సంబంధించిన గడిచిన కొన్నాళ్ల నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి మురారీ వెళుతున్నాడు. నెలలు తరబడి తిరుగుతున్నా పని చేయకుండా బదిలీపై వెళ్లడంతో తట్టుకోలేక హత్యకు యత్నించినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య వ్యవహారంలో సూత్రదారులు పెద్దలు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తహసీల్దార్‌ రమణయ్య హత్య కేసులు నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును పోలీసులు రిమాండ్‌కు తరలించారు.