Kerala Software Engineer Losing Fingers :  లావుగా ఉన్నానని సన్నగా మారాలని ఆ మహిళ అనుకుంది. దానికి లైపోసక్షన్ ఆపరేషన్ అయితే బెటర్ అనుకుంది. ఓ ఆస్పత్రి కూడా ఆపరేషన్ చేసి సన్నగా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ ఆస్పత్రి ఆమెను చావు అంచుల్లోకి తీసుకెళ్లింది. 

Continues below advertisement


 కేరళ రాజధాని తిరువనంతపురంలో  ఒక ప్రైవేట్ బ్యూటీ క్లినిక్‌లో   సాధారణ కాస్మెటిక్ ప్రక్రియ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీసి యువతికి ప్రాణాపాయానికి కారణం అయింది. చివరికి అనేక  వేళ్లను తొలగించాల్సి వచ్చింది.   ఎంఎస్ నీతు అనే మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. కాస్త లావుగా ఉండటంతో శరీరంలో పేరుకుపోయిన  కొవ్వు తొలగింపు కోసం ఓ క్లినిక్ కు వెళ్లారు.ఆ క్లినిక్ కూడా ముందూ వెనుకా చూసుకోకుండా ఆపరేషన్ నిర్వహించింది. 


ఆపరేషన్ చేసిన తరవాత నీతుకు చాలా సమస్యలు తలెత్తాయి.  కొన్ని రోజుల్లోనే, నీతును ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. రోజురోజుకు ఆమె బలహీనం అయ్యారు. చివరికి శ్వాస తీసుకోలేని పరిస్థితికి వెళ్లారు.   ఆస్పత్రిలో  21 రోజులు వెంటిలేటర్‌పై గడపాల్సి వచచింది. ఆమె ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ఆమె ఎడమ చేతి నుండి నాలుగు వేళ్లను ,  ఎడమ పాదం నుండి ఐదు వేళ్లను కత్తిరించాల్సి వచ్చింది.                      


ఆ తర్వాత ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు కాస్మెటిక్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆ ఆస్పత్రికి అసలు అనుమతులు లేవు. ఆ ఆస్పత్రి యజమాని పేరు డాక్టర్ షెనాల్ శశాంకన్. తన ఆస్పత్రి ప్రసిద్ధి చెందిందని..  అనేక మంది సినీ తారలు,  ప్రముఖులు ఈ  క్లినిక్‌లో  కొవ్వు తొలగించుకునే ఆపరేషన్లు  చేయించుకుని   చెప్పడంతో నీతు అంగీకరించారు. కానీ అది అబద్దమని తేలింది. 


లైపోసక్షన్ ఆపరేషన్ చేసిన తరవాత ఒక రోజుకే  నీతును డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అియన మధ్యాహ్నం నాటికి  ఆమె తీవ్ర అలసటకు గురయ్యారు.  ఓపిక లేకపోవడంతో వెంటనే క్లినిక్‌ను సంప్రదించింది.  అలాగే ఉంటుందని  ఉప్పు గంజి , నీరు తాగమని సలహా ఇచ్చాడు. అంతే చేసినా  ఆమె పరిస్థితి రాత్రిపూట క్షీణించింది . అసలు లేవలేని పరిస్థితి ఉండటంతో కుటుంబసభ్యులు వెంటనే వేరే ఆస్పత్రిలో  చేర్పించారు. అక్కడ టెస్టుల్లో అంతర్గత అవయవాలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  ఆమె ఎడమ కాలులో ప్రధాన ధమని మూసుకుపోయిందని, దీని ఫలితంగా రక్త ప్రవాహం తీవ్రంగా తగ్గిపోయి చలనశీలత దెబ్బతిందని తేలింది. చివరికి నాలుగు చేతి వేళ్లు, ఐదు కాలి వేళ్లను తొలగించారు. ఆమె కుటుంబం వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచచింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి మరియు సమగ్ర నివేదికను సమర్పించడానికి ఒక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ జెకె దినిల్ జిల్లా వైద్య అధికారిని  కోరారు.