కరోనా కట్టడి చేయడానికి కేరళ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నేడు కొన్ని కొవిడ్-19 మార్గదర్శకాలను విడుదల చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.
దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటే కేరళలో మాత్రం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రజలు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు.
ఇవే కొత్త మార్గదర్శకాలు..
- దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, కార్యాలయాలు, పరిశ్రమలు, పర్యటక ప్రాంతాలు సోమవారం నుంచి శనివారం వరకు తమ కార్యకలాపాలు నడపొచ్చు.
- దుకాణాలు, పర్యటక ప్రాంతాలు సహా ఇతర సంస్థలు తమ కార్యాలయాల ముందు ఉద్యోగుల వ్యాక్సినేషన్ వివరాలు కనిపించేలా ప్రదర్శించాలి. వినియోగదారులు అందర్నీ ఒకేసారి అనుమతించకుండా సమయానుకూలంగా సేవలు అందించాలి. వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోతే దానికి పూర్తి బాధ్యత యజమానులదే. మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అని తరచూ చెకింగ్ బృందాలు పరీక్షిస్తాయి.
- పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్ యూలు, కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, కమిషన్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయనున్నాయి.
- రెండు వారాలకు ముందు కొవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు అయిన తీసుకున్నవారు, 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారు, కొవిడ్ తగ్గి నెల రోజులు పూర్తయిన వారికి మాత్రమే దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమల్లో పనిచేయడానికి, అడుగుపెట్టడానికి అర్హత ఉంది.
- ప్రజలు గుమికూడకుండా ఉండేలా దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు వారి వీలును బట్టి వ్యాపారం చేసుకోవచ్చు. భౌతిక దూరం పాటిస్తూ మాత్రమే వినియోగదారులు దుకాణాల్లో కొనుగోలు చేయాలి.
- హాస్టల్స్, రెస్టారెంట్లలో రాత్రి 9.30 వరకు మాత్రమే ఆన్ లైన్ డెలివరీ సదుపాయం ఉంది.
- కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ మాత్రమే పబ్లిక్, ప్రైవేట్ వాహనాలు ప్రయాణాలు సాగించాలి.
- పోటీ, అర్హత, యూనివర్సిటీ పరీక్షలు, క్రీడల పోటీలు నిర్వహించుకోవచ్చు.
- ఆగస్చు 8 (ఆదివారం) పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఆగస్టు 15( స్వాతంత్య్ర దినోత్సవం)న మాత్రం ఎలాంటి లాక్ డౌన్ లేదు.
- పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సెంటర్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో డైనింగ్లపై నిషేధం.
- ఆన్ లైన్ డెలివరీ కోసం మాత్రమే మాల్స్ ఓపెన్ చేయాలి. విద్యాసంస్థలు కూడా ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ కోసం మాత్రమే తెరవాలి.
- సాంస్కృతిక, రాజకీయ బహిరంగ సభలకు ఎలాంటి అనుమతి లేదు. పెళ్లి, ఫంక్షన్లలో 20 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు.