Kerala CM Writes To Modi:
భిన్నత్వంలో ఏకత్వం..
భాజపాయేతర రాష్ట్రాల్లో రాజకీయాలతో పాటు ఇప్పుడంతా ఒకటే చర్చ. కేంద్రం అందరి మీదా "హిందీ" భాషను బలవంతంగా రుద్దాలని చూస్తోందని. దీనిపై ఇప్పటికే చాలా సార్లు చాలా మంది నేతలు గట్టిగానే స్పందించారు. హిందీ జాతీయ భాష అన్న భాజపా కామెంట్స్‌నీ పలు పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. "కేవలం ఓ
భాషను మాత్రమే ఎక్కువగా ప్రమోట్ చేసి, దాన్ని అందరిపైనా బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం మానుకోండి. ఇది సమైక్యతకు వ్యతిరేకం" అని ఆ లేఖలో పేర్కొన్నారు విజయన్. అంతే కాదు. భారత్‌లో "భిన్నత్వంలో ఏకత్వం" ఉందని...దానికి మచ్చ తెచ్చే పనులు మానుకోవాలని హితవు పలికారు. "భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత సంస్కృతి. ఎన్నో ఆచారాలు, భాషలు ఇక్కడ ఉన్నాయి. కేవలం ఓ భాషను వేరే వాళ్లపై రుద్దితే ఆ ఐక్యత దెబ్బతినే ప్రమాదముంది" అని స్పష్టం చేశారు. గతంలో తమిళనాడు విద్యామంత్రి కే. పొన్‌ముది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. "హిందీ మాట్లాడే వాళ్లంతా ఎలాంటి నైపుణ్యాలతో పని లేని తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది" అని కామెంట్ చేశారు. ఆ తరవాత అది సోషల్ మీడియాలోనూ యుద్ధానికి కారణమైంది. కొన్ని వర్గాలు హిందీ భాషకు మద్దతునివ్వగా...మరికొన్ని వ్యతిరేకించాయి.
అజయ్ దేవ్‌గణ్ వర్సెస్ సుదీప్..
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్,కన్నడ నటుడు సుదీప్ కిచ్చ మధ్య కూడా ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడిచింది. "హిందీ జాతీయ భాష కానే కాదు" అన్న సుదీప్ కిచ్చ కామెంట్స్‌ను ఖండిస్తూ అజయ్ దేవ్‌గణ్ ట్వీట్ చేశారు. "మై బ్రదర్ కిచ్చ సుదీప్. నీ దృష్టిలో హిందీ అనేది జాతీయ భాష కాకపోతే...మీ కన్నడ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారో చెప్పండి. హిందీ మా మాతృభాష. అది జాతీయ భాష కూడా. జనగణమన" అంటూ అప్పట్లో ట్వీట్ చేశారు అజయ్ దేవ్‌గణ్. ఈ మాటల యుద్ధం తరవాత మరోసారి హిందీ భాషను కావాలనే ఇంపోజ్ చేస్తున్నారన్న చర్చ మొదలైంది. అప్పుడు కిచ్చ సుదీప్‌కి కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై మద్దతుగా నిలిచారు.
కేటీఆర్ కామెంట్స్
ఇటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయమై పలు కామెంట్స్ చేశారు. "భారత్‌కు ఎలాంటి జాతీయ భాష లేదు, ఇక్కడ ఉన్న అన్ని భాషల్లో హిందీ ఒకటి మాత్రమే" అని వ్యాఖ్యానించారు కేటీఆర్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపై తీవ్రస్థాయిలో భాజపాపై మండి పడ్డ మరుసటి రోజే కేటీఆర్ ఇలా స్పందించారు. ట్విటర్ వేదికగా తన అసహనం వ్యక్తం చేశారు. "IITల్లో హిందీని తప్పనిసరి చేయటం ఎన్‌డీఏ ప్రభుత్వ ఫెడరలిజానికి ఉదాహరణ. ఏ భాష ఎంచుకోవాలనే స్వేచ్ఛ భారతీయులందరికీ ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడంపై మేము పూర్తిగా వ్యతిరేకం" అని స్ఫష్టం చేశారు.