Kerala Black Magic: కేరళలో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన వ్యవహారం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పథనంతిట్ట జిల్లాలో క్షుద్ర పూజలు చేస్తోన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పిల్లలతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు.

  


ఇదీ సంగతి


పథనంతిట్ట జిల్లాలోని మలయాళపుజా పట్టణానికి చెందిన ఓ మహిళ క్షుద్ర పూజలు చేస్తోంది. చిన్న పిల్లలను తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయిందని వెల్లడించారు.


దీంతో స్థానికులు మంత్రగత్తె అయిన మహిళకు వ్యతిరేకంగా గురువారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆమెపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.


క్షుద్ర పూజలు చేస్తున్న ఆ మహిళను అరెస్ట్‌ చేసే వరకు ఆందోళనలు విరమించబోమన్నారు. దీంతో డీఎస్‌పీ ఆదేశాలతో ఆ మహిళను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్షుద్ర పూజలకు పిల్లలను వినియోగించడంపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.


సంచలనం


కేరళలో ఇటీవల దారుణం జరిగింది. ఓ జంట ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా హత్య చేశారు. నరబలి ఇస్తే సంపన్నులైపోతామని నమ్మిన దంపతులు...ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడమే కాకుండా...శరీరాన్ని 56 ముక్కలుగా కోశారు. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే...వాళ్ల మాంసాన్ని కూడా తిన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రోసెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు చిత్రహింసకు గురై మృతి చెందారని విచారణలో తేలింది. చేతులు వెనక్కి కట్టేసి ఛాతీ భాగంపై తీవ్రంగా గాయం చేసి, కావాలనే రక్తంపోయే వరకూ హింసించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసి మూడు గోతులు తవ్వి వాటిలో ఆ అవయ వాలను పాతి పెట్టారు. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.


వీరికి మరో ఏజెంట్ సాయపడ్డాడు. అయితే...లైంగిక వేధింపులకూ గురి చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. నిందితులను విచారిస్తున్న సమయంలోనేపోలీసుల ప్రశ్నలకు సమాధానంగా "మేం వాళ్ల మాంసాన్ని తిన్నాం" అని షాకింగ్ సమాధానమిచ్చారట. అయితే...పోలీసులు మాత్రం దీన్ని ఇంకా నిర్ధరించలేదు. "ఇది నిరూపించాలంటే మాకు ఆధారాలు దొరకాలి" అని వెల్లడించారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. మృతుల్లో ఒకరైన రోసెలిన్ జూన్‌లో కనిపించకుండా పోయింది. ఆ తరవాత సెప్టెంబర్‌లో పద్మ మిస్సింగ్‌ అయినట్టు తేలింది. 


నమ్మించి


ఈ ఘటన జరిగే సమయానికే..పోలీసులు ఈ మిస్సింగ్‌ కేసులను ఛేదించే పనిలో ఉన్నారు. వీళ్లిద్దరి ఫోన్‌లనూ ట్రేస్ చేస్తే...మహమ్మద్ షఫీ అనే ఏజెంట్‌ వద్ద ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుంటే..మిగతా వివరాలన్నీ బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి మహిళలతో పరిచయం ఏర్పరుచుకుని, ఏదో బహుమతి ఇస్తాను రమ్మని వారిని పిలిచాడు. వచ్చాక వారిని కిడ్నాప్ చేశాడు మహమ్మద్ షఫీ. అయితే...అశ్లీల చిత్రాల్లో నటిస్తే డబ్బులిస్తానని ఆశచూపినట్టు కొందరు చెబుతున్నారు. "గతంలోనూ ఈ ఏజెంట్ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడా లేదా అన్న కోణంలో విచారణ చేపడుతున్నాం. ఈ హత్యల వెనక అతడి శాడిజమే మోటివ్‌గా కనిపిస్తోంది" అని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళను ఈ ఏజెంట్‌ అత్యాచారం చేశాడనీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఒంటిపై ఉన్న గాయాలే ఈ అనుమానాలకు తావిస్తోంది. 


Also Read: Gujarat AAP chief Detained: ఎన్నికల వేళ గుజరాత్ ఆప్‌ చీఫ్ అరెస్ట్!