Kerala RSS Leaders: 


పీఎఫ్‌ఐ నిఘాలో ఆర్‌ఎస్ఎస్


కేంద్ర ప్రభుత్వం కేరళలోని ఐదుగురు RSS నేతలకు Y కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. వారికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో...రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై ఐదేళ్లపాటు నిషేధం విధించింది కేంద్రం. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో PFI నిరసనలు చేపడుతోంది. కేరళలో ఇవి కాస్త తీవ్రంగా ఉన్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే...కేంద్రం అప్రమత్తమైంది. ఆ ఐదుగురు RSS నేతలకు ముప్పు ఉందని గమనించి ముందుగానే భద్రత పెంచారు. CRPF,VIP సెక్యూరిటీ విభాగం..
Y సెక్యూరిటీ ఇస్తాయి. ఒక్కో RSS సభ్యుడికి ఇద్దరి నుంచి ముగ్గురి వరకూ కమాండోలు భద్రత కల్పిస్తారు. PFI నిఘాలో RSS ఉందని, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం. జూన్‌లో అగ్నిపథ్‌పై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో బిహార్ భాజపా చీఫ్ సంజయ్ జైస్వాల్‌కు కూడా Y కేటగిరీ భద్రత కల్పించారు. చాన్నాళ్లుగా RSSలోని కీలక నేతలకు, BJP నేతలకు సెక్యూరిటీ పెంచారు. భాజపా నేతలు కే సురేంద్రన్, సందీప్ వారియర్‌నూ అప్రమత్తం చేశారు. ఇంటిలిజెన్స్ విభాగం, పోలీసులు తనను అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్టు సందీప్ వారియర్ వెల్లడించారు. 




ముకేశ్ అంబానీకి కూడా..


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి Z ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతినిస్తుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇది దృష్టిలో ఉంచుకుని...ఇంటిలిజెన్స్ వర్గాల సూచన మేరకు ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయనకు Z  కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. గతేడాది ముంబయిలోని ఆయన నివాసం అంటిలీయాకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమ త్తమైన కేంద్రం వెంటనే భద్రత పెంచింది. కేవలం అంబానీ అనే కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ భద్రత పెంచాలని అప్పుడే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావించింది. ఇండియాలో ప్రముఖ వ్యక్తులకు..వాళ్ల పాపులారిటీ ఆధారంగా ఈ భద్రత అందిస్తారు. అధికారిక భాషలో దీన్ని Security Cover అంటారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...ఏ కేటగిరీ భద్రత అందించాలో హోం శాఖ నిర్ణయం తీసుకుంటుంది.


ఇవీ భద్రతలు..


ప్రమాదం ఆధారంగా 5 కేటగిరీలుగా భద్రతను విభజిస్తారు. X,Y,Z,Z+,SPG సెక్యూరిటీ కవర్‌లు అందుబాటులో ఉంటాయి. వీఐపీలు, వీవీఐపీలు, ప్రముఖ వ్యక్తులు, క్రీడాకారులు, పొలిటికల్ పాపులారిటీ ఉన్న వాళ్లకు ఈ సెక్యూరిటీ అందిస్తారు. ఇందులో Z ప్లస్ కేటగిరీ టాప్‌లో ఉంటుంది. 55 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తారు. వీరిలో 10 మందికిపైగా NSG కమాండోలు, పోలీసులు ఉంటారు. ప్రతి కమాండో మార్షియల్ ఆర్ట్స్‌లో ఆరితేరి ఉంటారు. ఇప్పటి వరకూ భారత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు Z ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ముకేశ్ అంబానీ కూడా చేరనున్నారని తెలుస్తోంది.