Lok Sabha Elections Phase 6 2024 Updates: లోక్‌సభ ఆరో విడత పోలింగ్‌లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబంతో సహా వెళ్లి ఓటు వేశారు. ఆ తరవాత సోషల్ మీడియాలో ఆ ఫొటో  షేర్ చేశారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ లీడర్ ఒకరు భారత్‌లోని ఎన్నికలపై చేసిన కామెంట్‌ని కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ముందు మీ దేశం సంగతి చూసుకోండి అని చురకలు అంటించారు. పాకిస్థానీ నేత చౌద్రీ ఫవాద్ హుస్సేన్ (Fawad Hussain) X లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ ఎన్నికలతో ద్వేషానికి స్వస్తి పలికి శాంతియుత వాతావరణానికి స్వాగతం పలుకుతాయని అర్థం వచ్చేలా పరోక్షంగా మోదీ సర్కార్‌పై సెటైర్లు వేశారు. కేజ్రీవాల్‌ ఓటు వేసిన ఫొటోకి రిప్లై ఇస్తూ ఈ ట్వీట్ చేశాడు. అప్పటికే ఇది వివాదాస్పదమైంది. వెంటనే  స్పందించిన కేజ్రీవాల్ చాలా గట్టిగానే బదులిచ్చారు. మీ ట్వీట్‌తో తమకు పని లేదని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ముందు దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. 


"చౌద్రీ సాహిబ్ మా సమస్యల్ని మేమే పరిష్కరించుకోగలం. ఆ సామర్థ్యం మాకుంది. మీ ట్వీట్‌ మాకు అవసరం లేదు. పాకిస్థాన్‌లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. మీరు ముందు మీ సంగతి చూసుకుంటే చాలా మంచిది. ఎన్నికలు అనేవి మా అంతర్గత విషయం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే మీ లాంటి దేశాలు ఇందులో జోక్యం చేసుకోవడాన్ని ఏ మాత్రం సహించం"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి






అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌ ఓ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు వేసినట్టు వెల్లడించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని అందుకే ఆమె బయటకు రాలేకపోయారని చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలకు వ్యతిరేకంగా ఓటు వేశానని వివరించారు. 


"మా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాను. అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అందుకే రాలేకపోయింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని సృష్టించిన వాళ్లకి వ్యతిరేకంగా ఓటు వేశాను. మీరూ తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోండి


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి


 






Also Read: PM Modi: మోదీ బస చేసిన హోటల్‌కి బిల్ ఎగ్గొట్టిన అధికారులు, లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన యాజమాన్యం