తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు దళిత జపం చేస్తున్నారు. సీఎంగా కూడా ఆయన రోజువారీ కార్యక్రమాలు మొత్తం దళిత ఎజెండా చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు రోజుల కిందట హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన రామస్వామి అనే దళిత నేతతో మాట్లాడిన కేసీఆర్ ప్రగతి  భవన్‌కు ఆహ్వానించారు. సోమవారం హుజూరాబాద్ నుంచి ఎంపిక చేసిన 412 మంది దళితులతో విందు భేటీ నిర్వహించారు. కుటుంబానికి రూ. పది లక్షలు అందించే పథకంపై.. సమాలోచనలు జరిపారు.  ఇదొక్కటే కాదు.. మొత్తంగా ఆయన రోజువారీ నిర్ణయాలు దళిత కోణంలోనే ఉండేలా చూసుకుంటున్నారు. 


రోజూ దళిత కోణంలోనే కేసీఆర్ కార్యక్రమాలు.. !


హూజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల ఓట్లు నలభై వేల వరకు ఉన్నాయి.   వారిని ఇంప్రెస్ చేయడానికి కేసీఆర్ చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దళిత బంధు పథకం మాత్రమే కాదు...  ఇతర కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు కూడా ఆ నియోజకవర్గ దళిత నేతలకే అందిస్తున్నారు. బండా శ్రీనివాస్ అనే హుజూరాబాద్ నియోజకవర్గ నేతకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రకటించారు.  దశాబ్దాలుగా ఈటల రాజేందర్ అక్కడే రాజకీయం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా  దళితుల్లో ఈటల రాజేందర్‌కు పలుకుబడి ఉంది. తమకు ఈటల మేలు చేశాడన్న అభిప్రాయం వారిలో ఉందని కేసీఆర్ భావిస్తున్నారు.  


హుజూరాబాద్‌లో దళితుల ఓట్లపై ఆందోళన చెందుతున్నారా..?


ఈటల  టీఆర్ఎస్‌ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా వారు ఆయన వైపే ఉన్నారని .. తెలంగాణ రాష్ట్ర సమితికి సర్వే నివేదికలు అందినట్లుగా తెలుస్తోంది.   ఈ కారణంగానే హుజూరాబాద్ దళితులను ఈటలకు దూరం చేసి.. టీఆర్ఎస్‌కు దగ్గర చేస్తేనే అనుకూల ఫలితం వస్తుందని లేకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే... దళితుల్ని ఆకట్టుకునేందుకు రోజుకో పథకం ప్రకటిస్తున్నారని అంటున్నారు. వారిని మరింత దగ్గర చేసుకునేందుకు ప్రగతి భవన్‌కు ఆహ్వానించి విందులు ఇస్తున్నారు. నేరుగా ఫోన్లు చేసి మాట్లాడి.. వారికి తానున్నానని భరోసా ఇస్తున్నారు. 


దళిత సీఎం హామీ చర్చకు రాకుండానా..? 


కేసీఆర్ దళితుల మద్దతు విషయంలో ఆందోళన చెందుతూండటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని ఆయన ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. ఈ విషయాన్ని దళితుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు గుర్తు చేసి విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఉపఎన్నికల్లో ఈ అంశం చర్చకు వస్తే మరింత ఇబ్బందికరం అవుతుందని..  అందుకే.. దళిత బంధుతో దాన్ని అధిగమించాలని కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.