KBC winner won Rs 50000000 Now bankrupt : కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) ఐదవ సీజన్ విజేత సుశీల్ కుమార్. 2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్న తొలి విజేతగా గుర్తింపు పొందాడు. బీహార్‌లోని చంపారన్‌కు చెందిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. అయితే, అతని జీవితం ఊహించని మలుపులు తిరిగింది, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, వ్యక్తిగత సవాళ్లతో అతని కథ ఒక విషాదకరమైన దశకు చేరుకుంది. ఇప్పుడు ఆ ఐదు కోట్లు పోగొట్టుకున్నాడు. బతకడానికి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.
బీహార్‌లోని చంపారన్‌కు చెందిన సుశీల్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్‌గా , ఉపాధ్యాయుడిగా నెలకు రూ. 6,000 సంపాదిస్తూ సామాన్య జీవితాన్ని గడిపాడు. కేబీసీలో పాల్గొనడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఐదు కోట్లు గెలుచుకోవడంతో బీహార్‌లో స్థానిక సెలబ్రిటీగా మారారు. అతన్ని అమితాబ్ బచ్చన్ "నిజ జీవిత స్లమ్‌డాగ్ మిలియనీర్" అని పిలిచాడు. KBCలో గెలిచిన తర్వాత, అతను ఐఏఎస్ అధికారి కావాలని కలలు కన్నాడు. కానీ జరిగింది వేరు.
KBCలో గెలిచిన తర్వాత, సుశీల్ కుమార్ ఒక్కసారిగా వచ్చిన డబ్బు, ఖ్యాతినితో దారి తప్పాడు. 2020లో ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన జీవితంలోని కష్టకరమైన దశలను పంచుకున్నాడు. సుశీల్ తన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టలేకపోయాడు. అతను అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు, కానీ అనుభవం లేకపోవడం వల్ల అవి కొన్ని రోజుల్లోనే కుప్పకూలాయి. అతన్ని చందాల కోసం పలు కార్యక్రమాలకు పిలిచేవారు. అలాంటి కార్యక్రమాలకు వెళ్లి డబ్బులు చందాలుగా ఇచ్చి వచ్చేవాడు. సుశీల్ ను పలువురు వ్యాపారులు పార్టీలకు పిలిచేవారు. ఈ సందర్భంగా మద్యం, సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు.
వచ్చిన డబ్బులను జాగ్రత్త చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడంపై అతని భార్యతో సంబంధం దెబ్బతింది. ఓ దశలో వారు విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారు. సుశీల్ కుమార్ ఆర్థిక స్థితి క్షీణించడంతో, అతను దివాళా తీసినట్లు పుకార్లు వచ్చాయి. ఓ ఇంటర్యూలో సుశీల్ తన డబ్బు అయిపోయిందని, రెండు ఆవులను పెంచి, పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. ఈ వార్త వైరల్ అయింది, దీని తర్వాత అతన్ని ఈవెంట్‌లకు ఆహ్వానించడం ఆగిపోయింది. తర్వాత సుశీల్ సినిమా దర్శకుడు కావాలని నిర్ణయించుకుని ముంబైకి వెళ్లాడు, కానీ అక్కడ అతని కలలు నెరవేరలేదు. ఇక కుటుంబాన్ని నిలుపుకోవాలంటే తప్పదని.. చంపారన్‌కు వచ్చి మళ్లీ టీచర్ గా జాయినయ్యాడు.
జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బులకే నిలకడ ఉంటుందని పెద్దలకు చెబుతారు. అయితే ఆ కష్టం అనేది .. కష్టపడిన వారు కూడా గుర్తించాలి. చిన్న తనం నుంచి ఎంతో చదువుకుని జ్ఞానం పోగేసుకుంటే తప్ప కేబీసీలో విన్నర్ గా నిలవడం సాధ్యం కాదు. అలాంటి విజయాన్ని నెత్తికెక్కించుకుంటే మొదటికే మోసం వస్తుంది. సుశీల్ కుమార్ పరిస్థితి అదే. చాలా మంది ఈ విషయంలో సుశీల్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.