అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ద్యర్ధం బిక్షాన్ దేహిచ పార్వతి
అంటూ అన్నపూర్ణాదేవిని అర్చిస్తుంటారు. ఈ చరాచర సృష్టికి ఆకలిదప్పులు తీర్చే అమ్మగా అన్నపూర్ణను ప్రార్థిస్తారు. సాక్షాత్ కాశీవిశ్వనాథుడికే ఆకలితీర్చిన అమ్మ అన్నపూర్ణమ్మ. కాశీ అంటే పవిత్ర గంగా నది, కాశీ విశ్వనాధుడితో పాటూ అన్నపూర్ణ ఆలయం గురించి మాట్లాడుకుంటారు. గంగమ్మ దాహం తీరిస్తే, అన్నపూర్ణమ్మ ఆకలి తీరుస్తుంది. కాశీ నివాసిని అయిన ఈ అమ్మవారి విగ్రహం ఎప్పుడు ఎవరు దొంగిలించారో తెలియదు కానీ కెనడా చేరింది. అక్కడ చారిత్రక విగ్రహాలు, వస్తువులుండే చోట స్థిరపడింది. అయితే దశాబ్దాల క్రితం దేశం నుంచి దొంగతనానికి గురైన దేవతా మూర్తుల విగ్రహాలను భారత ప్రభుత్వం మళ్లీ స్వదేశానికి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి దొంగతనానికి గురైన అన్నపూర్ణ దేవి పురాతన విగ్రహాన్ని కెనడా నుంచి తీసుకొచ్చారు.
స్వదేశానికి చేరుకున్న అన్నపూర్ణ విగ్రహానికి ఢిల్లీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవంబర్ 15న వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో పున:ప్రతిష్టించనున్నారు.
ఇప్పటి వరకూ ఎన్‌డీఏ హయాంలో ఇలాంటి 42 అరుదైన కళాఖండాలు, చారిత్రక విగ్రహాలను భారత ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకొచ్చినట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.