Karthigai Deepam controversy Tamil Nadu govt against Madras HC judge: తమిళనాడులోని తిరుపరంకుండ్రం శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం పండుగ సందర్భంగా ఏర్పడిన వివాదం రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపారాధన చేసే స్థలాన్ని మార్చాలనే భక్తుల డిమాండ్ మధ్య, మద్రాస్ హైకోర్టు జడ్జి జీ.ఆర్. స్వామినాథన్ హిల్‌టాప్‌లో దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పోలీసులు భక్తులను అడ్డుకోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు, అప్పీల్స్ వంటివి జరుగుతున్నాయి. విషయం సుప్రీంకోర్టు జోక్యం వరకు వెళ్లింది. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో అభిశంసన పిటిషన్ కూడా దాఖలుచేసింది. డిఎంకే నేత కనిమోళి లోక్‌సభ స్పీకర్‌కు జడ్జి పదవి తొలగింపు కోసం ఇంపీచ్‌మెంట్ నోటీసు సమర్పించారు.
కార్తిక దీపం తమిళనాడులోని తిరుపరంకుండ్రం హిల్‌లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో జరిగే ప్రసిద్ధ పండుగ. దీన్ని దేవ దీపావళి లేదా దైవిక దీపారాధనగా పిలుస్తారు. సాంప్రదాయకంగా, భక్తులు ఆలయం కింది భాగంలోని ఉచిపిల్లయార్ కోవిల్ మండపం సమీపంలో దీపం వెలిగిస్తారు. ఈ పండుగలో హిల్‌టాప్‌లోని దీపతూణ్ వద్ద దీపారాధన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. 1990ల నుంచి ఈ అంశం వివాదాస్పదంగా ఉంది. తిరుపరంకుండ్రం హిల్‌లో ప్రాచీన రాక్-కట్ టెంపుల్‌తో పాటు ఒక దర్గా కూడా ఉంది. ఈ కారణంగా 1920 నుంచి వివాదాలు ఉన్నాయి.
వివాదం మూలం దీపం వెలిగించే స్థలం. హిందూ తమిళర్ కచ్చి ( స్థాపకుడు రామ రవికుమార్ హిల్‌టాప్ దీపతూణ్ వద్ద దీపం వెలిగిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ జడ్జి జీ.ఆర్. స్వామినాథన్ డిసెంబర్ 1, 2025న ఈ పిటిషన్‌ను అనుమతించారు. దీని ప్రకారం, భక్తులు హిల్‌టాప్‌లో దీపం వెలిగించవచ్చు. అయితే, తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ చేసి, పోలీసుల ద్వారా భక్తులను హిల్‌కు చేరుకోకుండా అడ్డుకున్నారు. డిసెంబర్ 3న జరిగిన పండుగ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనిపై రవికుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి సిఐఎస్‌ఎఫ్ రక్షణలో 10 మంది భక్తులతో దీపారాధన చేయడానికి అనుమతి ఇచ్చారు. కానీ పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు.
ఈ ఘటనలు ప్రభుత్వం-కోర్టు మధ్య ఘర్షణను మరింత పెంచాయి. ప్రభుత్వం హైకోర్టులో సింగిల్ జడ్జి ఆర్డర్‌పై అప్పీల్, సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్‌పై అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు ఈ అప్పీల్‌ను ఆమోదించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 10న విచారణ జరుపనుంది. 1920ల నుంచి తిరుపరంకుండ్రం హిల్ యాజమాన్యం ఆలయం vs దర్గా వివాదాలు ఉన్నాయి. 1994లో ఒక భక్త దీపారాధనను హిల్‌టాప్‌కు మార్చాలని కోర్టుకు వెళ్లాడు. 1996లో మద్రాస్ హైకోర్టు సాధారణంగా మండపం వద్దే దీపం వెలిగించాలి అని తీర్పు ఇచ్చింది. ఇది ఏకైక చట్టపరమైన ఆర్డర్, ఇది ఇప్పటికీ ప్రభుత్వం ఆధారంగా చూపిస్తోంది.
ఈ వివాదం కేవలం దీపారాధన స్థలానికి సంబంధించినది కాదు; ఇది ఆలయ సంప్రదాయాలపై ప్రభుత్వ జోక్యం, భక్తుల హక్కులు వంటి వాటిపై చర్చకు కారణం అవుతోంది. 1996 తీర్పు ఆధారంగా ప్రభుత్వం తన వైఖరి సమర్థిస్తోంది, కానీ జడ్జి ఆర్డర్ భక్తుల స్వేచ్ఛను ప్రోత్సహిస్తోంది. న్యాయమూర్తిపై అభిశంసన దీన్ని మరింతగా రాజకీయం చేసింది.