Kukatpally MLA Madhavaram Krishna Rao made harsh comments on Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కె. కవితపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కవిత ఇటీవల కూకట్‌పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనలో హైదరాబాద్ ఎమ్మెల్యేలను 'బీ.టీ. బ్యాచ్' అని విమర్శించడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. కవిత చరిత్ర హీనురాలు, మంత్రి పదవులు అమ్ముకున్నారు, భూముల దోపిడీలు చేశారు, పార్టీలో కుట్రలు పన్నారు అంటూ పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్ మర్యాద కోసం ఊరుకుంటున్నాను, ఇక సహనంతో ఉండేది లేదని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ( అధ్యక్షురాలు కె. కవిత, గురువారం కూకట్‌పల్లిలో 'జన జాగృతి జనం బాట' పర్యటనలో హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరంలో ఉండే ఎమ్మెల్యేలు 'బీ.టీ. బ్యాచ్' లా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు చెప్పుకుంటున్నారు కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి నడుస్తున్నామని, నగరంలో ఉండే ఎమ్మెల్యేలు 'బీ.టీ. బ్యాచ్' అని చెప్పడం దారుణమని విమర్శించారు. "ఉద్యమంలో పనిచేయకపోయినా, తాము అందరం తెలంగాణ కోసం పని చేశాం. మేము ఉద్యమం చేశామని ఎప్పుడూ చెప్పుకోలేదు" అని స్పష్టం చేశారు. మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. కవితపై తీవ్ర ఆరోపణలు చేశారు. "తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేసావు. తెలంగాణ చరిత్ర హీనురాలు కవిత. చివరకు ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుంది ఎమ్మెల్సీ కవిత" అని ఎగతాళి చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన స్థాయి కవితకు లేదని, "నీ లాంటి కుక్కలు చాలామంది ఇక్కడికి వచ్చి మెరిగి పోయారు" అని తిట్టారు. కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదని, కవిత బండారం బయటపెట్టితే తెలుస్తుందని హెచ్చరించారు. బాలానగర్‌లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని ఓవర్‌ల్యాప్ ల్యాండ్‌ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని ఆరోపించారు. పార్టీ పేరుతో 36 ఎకరాల భూమిని దోచుకున్నారని కూడా చెప్పారు. పార్టీ లోపల కుట్రలు చేస్తోందని, హరీష్ రావును పార్టీ నుండి వెళ్లగొట్టాలన్నదే కవిత టార్గెట్. కేటీఆర్‌ను ఏదో విధంగా అరెస్ట్ చేయించాలనే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టింది అని ఆరోపించారు.
మాధవరం వ్యాఖ్యలపై కవిత పరోక్షంగాస్పందించారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లు అని.. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరని హెచ్చరించారు.