aKarnataka CM Race:
బీజేపీ నేత విమర్శలు..
గెలిచిందాకా ఓ బాధ. గెలిచాక మరో బాధ. కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడిలానే ఉంది. అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించామన్న సంతోషంలో ఉండగానే...పెద్ద చిక్కొచ్చి పడింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికి అప్పగించాలో అర్థంకాక హైకమాండ్ తల పట్టుకుంటోంది. డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య రేస్ నడుస్తోంది. సీనియర్‌ని గౌరవించి సిద్దరామయ్యకు ఆ పదవినివ్వాలా..? లేదంటే కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కారణమైన శివకుమార్‌ని ఈ కుర్చీలో కూర్చోబెట్టాలా అని..ఎటూ తేల్చుకోలేకపోతోంది. వరుసగా ఇద్దరి నేతలతో అధిష్ఠానం భేటీ అవుతున్నా...ఇంకా పేరు మాత్రం ఖరారు కాలేదు. త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సీఎం పేరుని ప్రకటించే అవకాశముంది. రాహుల్‌తోనూ భేటీ అవుతున్నారు. ఈ మొత్తం పరిణామాలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. అంతే కాదు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై సంచలన ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత సుధాకర్...సిద్దరామయ్యపై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. గతంలో కాంగ్రెస్ జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏడాది తరవాత ఉన్నట్టుండి కాంగ్రెస్‌లోని 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం పడిపోవడానికి కారణమయ్యారు. ఇదంతా జరగడానికి సిద్దరామయ్యే కారణం అని విమర్శించారు సుధాకర్. ఎమ్మెల్యేల సమస్యల్ని పరిష్కరించలేకపోయారని మండి పడ్డారు.
"తమ సమస్యలు చెప్పుకోడానికి ఎమ్మెల్యేలు సిద్దరామయ్య దగ్గరికెళ్లిన ప్రతిసారీ నిరాశగా వెనుదిరిగేవాళ్లు. అప్పట్లో సిద్దరామయ్య కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. జేడీఎస్ -కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో తమకు కలుగుతున్న ఇబ్బందులని ఎమ్మెల్యేలు చెప్పుకునే వాళ్లు. సిద్దరామయ్య మాత్రం అలాంటివేవీ లేవని సమాధానమిచ్చేవారు. లోక్‌సభ ఎన్నికలు (2019) జరిగిన తరవాత కుమారస్వామి ప్రభుత్వం ఒక్క రోజు కూడా నిలబడలేదని అన్నారు. మేం మాత్రం ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోడానికి అంతా రాజీనామా చేశాం. ఆ తరవాత ప్రజలే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది..? దీనంతటికీ కారణం సిద్దరామయ్యే కదా"