Karnataka CM :   కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆఫీసు సిబ్బంది దీపావళి సందర్భంగా జర్నలిస్టులకు పెద్ద మొత్తంలో కవర్లలో డబ్బులు పంపిణీ చేయడం వివాదాస్పదం అవుతోంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో   ఈ పని చేసినట్లుగా భావిస్తున్నారు. దీపావళి ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం  దగ్గర విధుల్లో ఉన్న జర్నలిస్టుల్లో పలువురుకి సీఎంవోలోకి కీలక అధికారి ఒకరు కవర్లు పంపిణీ చేశారు. ఆ కవర్లలో డబ్బులు ఉన్నట్లు చాలా మందికి తెలియదు. అవి స్వీట్ బాక్సులేమో అనుకున్నారు. కానీ అందులో ఉన్నవి డబ్బులని తెలియడంతో కొంత మంది వెనక్కి ఇచ్చేశారు. మరికొంత మంది సైలెంట్ అయ్యారు. ఈ విషయం  బయటకు రావడం సంచలనం అయింది. 


జర్నలిస్టులకు రూ. లక్షలు ఉన్న కవర్లను దీపావళి బహుమతిగా పంపిణీ చేసిన సీఎంవో అధికారి


ముఖ్యమంత్రి ఆఫీసు సిబ్బంది ఇచ్చిన కవర్లలో కనీసం రూ. లక్ష నుంచి రూ. రెండున్నర లక్షల వరకూ ఉన్నాయని  తెలుస్తోంది. తాము కవర్లు అందుకున్న మాట నిజమేనని అందులో రూ. లక్ష కంటే ఎక్కువగానే ఉన్నాయని..  డబ్బులను చూసి తిరిగి ఇచ్చేశామని కొంత మంది సీనియర్ జర్నలిస్టులు  ధృవీకరించారు. మరికొంత మంది వాటిలో ఎంత ఉందో చూడలేదు కానీ.. డబ్బులు చూసి కవర్లను తిరిగి ఇచ్చేశామన్నారు. ఇలా ముగ్గురు నలుగురు జర్నలిస్టులు తిరిగి ఇచ్చినట్లుగా చెప్పారు. మిగతా వారు స్పందించలేదు. అయితే ఈ అంశంపై ఇంకా సీఎంవో అధికారికంగా స్పందించలేదు. 


కవర్లలో డబ్బులు చూసి తిరిగి ఇచ్చేసిన కొంత మంది జర్నలిస్టులు 


జర్నలిస్టులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారని రాజకీయ పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి.  ప్రజలకు నిజాలు చెప్పే మీడియాకు కూడా లంచం ఇవ్వాలని ప్రయత్నం చేశారంటే..ప్రభుత్వంలో ఎంత అవినీతి పేరుకుపోయిందో స్పష్టమవుతోదంని అంటున్నాయి. కర్ణాటకలో ఏ పని చేపట్టాలన్నా 40 శాతం కమిషన్ ఇవ్వాలన్న ఓ ఆరోపణ ఉంది. అందుకే ఇటీవల "పేసీఎం" పేరుతో పోస్టర్లు వేయడం కలకలం రేపింది. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా సీఎంవో కార్యాలయం నగదు రూపంలో జర్నలిస్టులకు లక్షలకు లక్షలు ఇవ్వాలనుకోవడం మరింత దుమారం రేపుతోంది. 


త్వరలో కర్ణాటకలో ఎన్నికలు -  వ్యతిరేక వార్తలు రాకుండా జర్నలిస్టులకు లంచం ఇచ్చారని విపక్షాల ఆగ్రహం


ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పుడూ జర్నలిస్టులకు దీపావళికి కూడా ఎలాంటి బహుముతులు ఇవ్వదు. జర్నలిస్టులు ఎప్పుడూ ఇలాంటివి తీసుకోరు. కానీ ఈ సారి మాత్రం దీపావళి పండుగ అయిపోయిన తర్వాత ఇలాంటి గిఫ్ట్ కవర్లు ఇవ్వడం మాత్రం దుమారం రేపుతోంది. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. అవినీతిపై కథనాలు వస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఇలా నేరుగా జర్నలిస్టులకు డబ్బులు పంపిణీ చేయడం అనూహ్యమైనదిగా మారింది.  ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.