Karnataka Cabinet:



కేబినెట్ మీటింగ్ 


ఐదు హామీలతో కర్ణాటకలో (five guarantees) భారీ మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్. సిద్దరామయ్య నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ పూర్తైన తరవాత ఈ హామీలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది ప్రభుత్వం. తక్షణమే వీటిని అమల్లోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాలను అమలు చేసేందుకు నిర్ణయించినట్టు సిద్దరామయ్య ప్రకటించారు. గృహ జ్యోతి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ అందించనుంది కాంగ్రెస్ సర్కార్. ఈ పథకం జులై 1 వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు సిద్దరామయ్య. ఇప్పటి వరకూ వచ్చిన బిల్‌ని మాత్రం తప్పకుండా చెల్లించాలని తేల్చి చెప్పారు. అయితే...200 యూనిట్ల లోపు ఉంటేనే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక గృహ లక్ష్మి పథకం విషయానికొస్తే...ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే...ఈ డబ్బులు రావాలంటే లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్‌లు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలని కండీషన్ పెట్టారు. ప్రస్తుతానికి ఆధార్ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే...జూన్ 15 నుంచి జులై 15వ తేదీ లోగా ఎప్పుడైనా చేసుకోవచ్చని గడువునిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆగష్టు 15 నాటికి ఈ ప్రక్రియ ముగియనుంది. అప్పటి నుంచే చెల్లింపులు మొదలవుతాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారితో పాటు అంత్యోదయ కార్డులున్న వారికీ ఈ పథకం వర్తిస్తుందని సిద్దరామయ్య చెప్పారు. 










మహిళలకు ఉచిత బస్ సౌకర్యం..


అన్న భాగ్య పథకం గురించీ ప్రస్తావించారు సిద్దరామయ్య. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం అందించనున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 కిలోల బియ్యం ఇచ్చేది. అయితే...బీజేపీ ప్రభుత్వంలో దీన్ని 5 కిలోలకు తగ్గించారు. ఇప్పుడు సిద్దరామయ్య సర్కార్ ఏకంగా దాన్ని 10 కిలోలకు పెంచింది. ఈ పథకం కూడా జులై 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఉచిత ప్రయాణ హామీ వివరాలనూ చెప్పారు. జూన్ 11వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పించనున్నారు. KSRTCల్లో 50% సీట్లు పురుషులకే కేటాయించనున్నారు. డిగ్రీ పూర్తైన 6 నెలల వరకూ ఎలాంటి ఉద్యోగం లభించని వాళ్లకు యువ నిధి హామీ కింద 24 నెలల పాటు నెలకు రూ.3వేల ఆర్థిక సాయం అందిచనున్నారు. డిప్లొమా చేసిన ఉద్యోగం సాధించలేని వాళ్లకు నెలకు రూ.1,500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 


Also Read: Wrestlers Protest: బ్రిజ్ భూషణ్‌కి హైకమాండ్ వార్నింగ్! అనవసర వ్యాఖ్యలు చేయొద్దని మందలింపు!