BJP MP Bindi Remarks:
నోరు జారిన ఎంపీ మునిస్వామి..
కర్ణాటక బీజేపీ ఎంపీ ఎస్ మునిస్వామి చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా వ్యాపారి బొట్టు పెట్టుకోలేదన్న ఆగ్రహంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలార్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఆమెపై నోరు జారడం వివాదస్పదమవుతోంది. అది కూడా మహిళా దినోత్సవం రోజునే జరగటం మరింత సంచలనమైంది. మహిళలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఎంపీ మునిస్వామి...ఓ స్టాల్ వద్ద ఆగారు. అక్కడ మహిళా వ్యాపారిని చూసి తిట్టడం మొదలు పెట్టారు. "బొట్టెందుకు పెట్టుకోలేదు. ముందు బొట్టు పెట్టుకో. నీ భర్త బతికే ఉన్నాడా లేడా..? కామన్ సెన్స్ లేదా..? ఎందుకు బొట్టు పెట్టుకోలేదు" అంటూ ఆమెపై అరిచారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతల అసలు స్వరూపం బయటపడిందంటూ మండి పడుతోంది. కాంగ్రెస్ ఎంపీ కార్తి పీ చిదంబరం ఈ వివాదంపై స్పందించారు. ఇండియాను బీజేపీ హిందుత్వ ఇరాన్‌గా మార్చాలని చూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు ఎంపీ మునిస్వామిని తిట్టిపోస్తున్నారు. ఆమె బొట్టు పెట్టుకోవాలో లేదో చెప్పడానికి ఆయనెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.