Mahmud Gawan Madrasa:
వందేళ్లుగా పూజలు..?
బీదర్‌లోని మదర్సాలో విజయదశమి పూజలు నిర్వహించటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. స్థానికంగా హిందూ, ముస్లింల మధ్య వాగ్వాదానికి దారి తీసిందీ ఘటన. అయితే..దీనిపై బీదర్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఇష్వార్ సింగ్ స్పందించారు. ఈ మదర్సాలో పూజలు చేయటం కొత్తేమీ కాదని, కొందరు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారని మండి పడ్డారు. "మదర్సాలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది. దాదాపు వందేళ్లుగా ఆ అమ్మవారికి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా...అమ్మవారికి పూజలు చేసేందుకు లోపలకు వెళ్లారు" అని చెప్పారు ఇష్వార్ సింగ్. "ఈ మదర్సాకు తాళం వేసిన వాళ్లే స్వయంగా తెరిచారు. లోపలకు వెళ్లి పూజలు నిర్వహించారు. కొందరు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పోలీసుల అనుమతితోనే పూజలు చేశాం" అని చెప్పారు.
మదర్సాలోకి చొచ్చుకుపోయి పూజలు..
కర్ణాటకలోని బీదర్‌లో దసరా ఉత్సవాల్లో కలకలం రేగింది. కొందరు మదర్సాలోకి దూసుకెళ్లి అక్కడే పూజలు చేశారు. మహమూద్ గవాన్ మదర్సాలో ఈ ఘటన జరగ్గా...కర్ణాటక పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో పరోక్షంగా సంబంధం ఉన్న మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. "బీదర్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. వీళ్లు మదర్సాలోకి దూసుకెళ్లి దసరా పూజలు నిర్వహించారు" అని అడిషనల్ ఎస్‌పీ వెల్లడించారు. ఈ ఘటన తరవాత కొందరు ముస్లింలు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన చేపట్టారు. పరిస్థితులు అదుపు తప్పక ముందే పోలీసులు వచ్చి కంట్రోల్ చేశారు. మదర్సాలోకి వెళ్లడమే కాకుండా కొందరు అందులోనే కొబ్బరి కాయలు కొట్టి కావాలనే కొన్ని
చోట్ల ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై మాత్రం పోలీసులు స్పందించలేదు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందించారు. మదర్సాలోకి దూసుకెళ్తున్న వీడియోను షేర్ చేశారు. "కొందరు గేట్ తాళం పగలగొట్టి మరీ లోపలకు దూసుకెళ్లారు. ఇలాంటివి జరిగేంత అవకాశం ఎలా ఇస్తున్నారు..? కేవలం ముస్లింలను కించపరచటానికే..భాజపా ఇలా చేయిస్తోంది" అని ట్విటర్ వేదికగా మండి పడ్డారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...9 మందిని అరెస్ట్ చేశారు. Archeological Survey of India (ASI)నిర్వహణలో ఉన్న ఈ మదర్సాను 1460ల్లో నిర్మించారు.