Karnataka Assembly Elections 2023:
కోలార్‌లో ర్యాలీ
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు. అనర్హతా వేటుతో తనను భయపెట్టాలని చూస్తున్నారని, అది కుదరదని తేల్చి చెప్పారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తరవాత భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జైల్లో పెట్టినా తగ్గేదేలేదని స్పష్టం చేశారు. ప్రధాని, అదాని మధ్య సంబంధం ఏంటో చెప్పాలని మళ్లీ డిమాండ్ చేశారు రాహుల్.
"అనర్హతా వేటుతో వాళ్లు (బీజేపీ) నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ నేను భయపడను. నన్ను జైల్లో పెడితే పెట్టండి. నేనే దేనికైనా సిద్ధమే. ప్రధాని, అదాని మధ్య సంబంధం ఏంటో కచ్చితంగా చెప్పాల్సిందే"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదే వేదికగా ఎన్నికల హామీలనూ వెల్లడించారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. మహిళలకూ నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్‌లకూ స్టైఫండ్ ఇస్తామని చెప్పారు.
"మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తాం. ప్రతి మహిళకూ నెలనెల రూ.2 వేల ఆర్థిక సాయం చేస్తాం. గ్రాడ్యుయేట్‌లకు రెండేళ్ల పాటు నెలకు రూ.3 వేలు, డిప్లొమా చేసిన వాళ్లకు రూ.1,500 అందిస్తాం. ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ పని చేసినా సరే..అందులో 40% కమీషన్ తీసుకుంటోంది. ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాసినా ఆయన స్పందించలేదు. అంటే 40% కమీషన్ తీసుకుంటున్నట్టు ప్రధాని అంగీకరించినట్టేగా. పార్లమెంట్ సమావేశాలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోంది. ఇలా జరగడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ ఆఫీస్ సమీపంలోని ఇందిరా గాంధీ భవన్‌ను ప్రారంభించనున్నారు రాహుల్.