Karnataka Assembly Election 2023: 


బీజేపీ ఓటమి..


కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సంబరాలు చేసుకుంటోంది. అటు బీజేపీ మాత్రం ఎందుకిలా జరిగింది అని అనలైజేషన్ మొదలు పెట్టింది. హైకమాండ్‌ కూడా అలెర్ట్ అయ్యింది. ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఈ ఫలితాలపై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ చేశారు. EVMలపై తప్పు తోసేయకుండా ఆత్మపరిశీలన చేసుకుంటామని చెప్పారు. 


"ప్రజాతీర్పుని మేమెప్పుడైనా గౌరవిస్తాం. ఓటమినైనా సరే స్వీకరిస్తాం. మా ఓటమికి EVMలే కారణమని బ్లేమ్ చేయం. ఇంకెవరో మమ్మల్ని ఓడించారనీ నిందలు వేయం. అందుకు బదులుగా ఎందుకు ఓడిపోయామో ఆత్మపరిశీలన చేసుకుంటాం. బీజేపీ కర్ణాటక ఈ ఓటమిని అంగీకరిస్తుందని భావిస్తున్నాను. అయినా సరే కర్ణాటక ప్రజలకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటున్నా"


- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం






పని చేయని మోదీ మ్యాజిక్..


సోనిట్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిమంత...ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు. బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ గెలుపుతో పోల్చుకుంటే ఇది సాధారణమే అని అన్నారు. కర్ణాటక ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన శర్మ..రాష్ట్రంలో తమకు ప్రజలు మద్దతునివ్వలేదన్న విషయాన్ని తొందరగానే గ్రహించామని స్పష్టం చేశారు. ఇక కర్ణాటక సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా లాంటి కీలక వ్యక్తులు వచ్చి ప్రచారం చేసినా..బీజేపీకి పరాభవం తప్పలేదు. 136 సీట్లతో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించింది. కింగ్‌మేకర్‌గా మారుతుందనుకున్న జేడీఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎగ్జిట్  పోల్స్ ముందుగానే బీజేపీ ఓటమిని అంచనా వేశాయి. కానీ...బీజేపీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చివరకు...అనుకున్నదే అయింది. 


బీజేపీ ముక్త్ సౌత్


"కాంగ్రెస్ ముక్త్ భారత్". బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే నినాదం వినిపిస్తోంది. రెండు సార్లు కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చింది కాషాయ పార్టీ. అయినా...ఈ నినాదాన్ని మాత్రం వదలట్లేదు. బీజేపీ నేతలందరూ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఇదే స్లోగన్ వినిపిస్తుంటారు. నార్త్‌లో గట్టిగానే క్యాడర్ పెంచుకున్న బీజేపీకి సౌత్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ కనిపించడం లేదు. ఉన్న ఒక్క కర్ణాటకలోనూ అధికారం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ లీడ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీకి గట్టి  కౌంటర్ ఇస్తోంది. "కాంగ్రెస్ ముక్త్ భారత్" స్లోగన్‌కి కౌంటర్‌గా "బీజేపీ ముక్త్ సౌత్" (BJP Mukt South India) నినాదాన్ని ఎత్తుకుంది. ట్విటర్‌లో పెద్ద ఎత్తున ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు పెడుతోంది. దక్షిణాది ప్రజలు బీజేపీని రిజెక్ట్ చేస్తున్నారంటూ (BJP Mukt South ) ట్వీట్‌లు చేస్తోంది.


Also Read: Karnataka Next CM: కర్ణాటక సీఎం పదవిపై వీడని ఉత్కంఠ, పోస్టర్లు ఫ్లెక్సీలతో అభిమానుల యుద్ధం