కొత్త సాగు చట్టాలపై రైతుల అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వేలాది మంది అన్నదాతలు హరియాణాలోని వివిధ ప్రాంతాల నుంచి కర్నాల్ లో ఏర్పాటు చేసిన కిసాన్ మాహా పంచాయత్ కు హాజరయ్యేందుకు తరలివెళ్తున్నారు. వందలాది మంది పారామిలిటరీ దళాలు, పోలీసులను మోహరించింది సర్కార్. అయినప్పటికీ రైతులు.. బైక్ లు, ట్రాక్టర్లు సహా ఏది దొరికితే ఆ వాహనంపై కర్నల్ కు చేరుకుంటున్నారు. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా కర్నాల్ చేరితీరతామని చెబుతున్నారు.





 


అయితే ఈ సందర్భంగా 11 మంది రైతు నేతలతో కూడిన బృందం జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలమైనట్లు రైతులు తెలిపారు. 






టికాయత్ అరెస్ట్..


పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల రైతు సంఘాల నేతలు యోగెంద్ర యాదవ్, రాకేశ్ టికాయత్ సహా సంయుక్త కిసాన్ మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.






భారీ భద్రత..


ఆగస్టు 28 కర్నాల్ లో రైతులపై జరిగిన లాఠీ ఛార్జిని నిరసిస్తూ అన్నదాతలు హరియాణాలోని మినీ సెక్రటేరియట్ ను ముట్టడించాలని ఆలోచిస్తున్నారు.  కర్నాల్ లో పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించింది సర్కార్. మొత్తం 40 కంపెనీల బలగాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.


రైతుల డిమాండ్..


కర్నాల్ లో ఇటీవల రైతులపై లాఠీ ఛార్జికి ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు.