Kangana Ranaut to contest from Mandi: ఎప్పటి నుంచో పొలిటికల్ ఎంట్రీపై హింట్స్ ఇస్తూ వచ్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మొత్తానికి ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. వాస్తవానికి ఆమె బీజేపీలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అనుకున్నట్టుగానే హైకమాండ్ ఆమెకి టికెట్ ఆఫర్ చేసింది. అధిష్ఠానం నిర్ణయంపై ఆమె తొలిసారి స్పందించారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సొంత చోటే ఎంపీగా పోటీ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే అంత కన్నా సంతోషం ఇంకేమీ ఉండదని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చానని, తనను ఎన్నుకుంటే అవసరం ఉన్న వాళ్లకి ఎప్పటికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కచ్చితంగా గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. మండిలో తన సొంతింట్లో హోళీ వేడుకలు చేసుకున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"అందరికీ హోళీ శుభాకాంక్షలు. ఇది నా పుట్టినిల్లు. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మండి ప్రజలు నన్ను ఎన్నుకుంటే కచ్చితంగా సేవలందిస్తాను. నాకే కాదు. నా కుటుంబ సభ్యులందరికీ ఇది ఎంతో భావోద్వేగానికి గురి చేసింది"
- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తనకు ఎంతో అండగా నిలిచారని వెల్లడించారు కంగనా. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తాను ఓ సూపర్ స్టార్ అని ఎప్పుడూ అనుకోలేదని, బీజేపీలో ఓ సామాన్య కార్యకర్తలానే పని చేస్తానని తెలిపారు.
"నా ప్రయాణం ఎప్పుడూ బీజేపీ సిద్ధాంతాలతోనే. కచ్చితంగా మేం గెలుస్తాం అన్న నమ్మకముంది. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం. బీజేపీ ఎజెండాని మారుమూల గ్రామాల వరకూ తీసుకెళ్తాం. పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టే లెక్క. ప్రధాని మోదీ గెలిస్తే మొత్తం ఎన్నికలే గెలిచినట్టు. నేనో సూపర్ స్టార్‌నని ఎప్పుడూ అనుకోలేదు. బీజేపీలో ఓ సామాన్య కార్యకర్తలా పని చేస్తాను. హైకమాండ్ ఆదేశాల మేరకు నడుచుకుంటాను"
- కంగనా రనౌత్, బాలీవుడ్ నటి
Also Read: Bengaluru Water Crisis: నీటి వృథాపై బెంగళూరు అధికారులు సీరియస్, రూ.లక్ష జరిమానాలు వసూలు