Lok Sabha Elections Phase 7 Updates: బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మండి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు కంగనా. చివరి విడత పోలింగ్‌ జరుగుతున్న రాష్ట్రాల్లో జాబితాలో హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ మోదీ వేవ్ కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు ఎంపీ స్థానాలనూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 


"నా ఓటు హక్కుని నేను వినియోగించుకున్నాను. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ. అందరూ తప్పనిసరిగా ఇందులో పాల్గొనాలి. ఓటు వేయాలి. హిమాచల్‌ప్రదేశ్‌లో మోదీ వేవ్ కనిపిస్తోంది. మండి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. రాష్ట్రంలోని నాలుగు ఎంపీ స్థానాలనూ గెలుచుకుంటామన్న నమ్మకముంది. 400 సీట్ల లక్ష్యాన్నీ సాధిస్తాం"


- కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ అభ్యర్థి 




మండి నియోజకవర్గంలో కంగనాకి రనౌత్‌కి ప్రత్యర్థిగా విక్రమాదిత్య సింగ్ బరిలోకి దిగారు. విక్రమాదిత్య హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కొడుకు కావడం వల్ల ప్రజలు ఆయనకే మొగ్గు చూపుతారని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇక కంగనా విషయానికొస్తే తన వ్యక్తిగత చరిష్మాతో పాటు ప్రధాని మోదీ క్రేజ్‌, రామ మందిర నిర్మాణం లాంటి అంశాలు కలిసొచ్చే అవకాశముంది. నిజానికి మండి నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోట లాంటిది. అందుకే కంగనాని ఇక్కడే నిలబెట్టింది బీజేపీ