US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమైన కమలా హారిస్‌ విరాళాల సేకరణలో జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు. బైడెన్‌ పోటీ నుంచి వైదొలగడంతో పోటీలోకి వచ్చిన ఆమె కేవలం వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను సేకరించారు. ఈ విషయాన్ని కమలా హారిస్  ‘టీమ్ హారిస్’ ఆదివారం తెలిపింది. ఇంత తక్కువ సమయంలో 20కోట్ల డాలర్ల విరాళాలు సేకరించడం హారిస్‌కు మద్దతు పెరుగుతోందని తెలియజేస్తోందని ‘టీమ్ హారిస్’ తెలిపింది. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని, ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. జూలై 20న ప్రెసిడెంట్ జో బిడెన్ తాను ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయ్యారు.   


ట్రంప్, కమలా హారిస్ మధ్య గట్టి పోటీ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో నిలుచున్న కమలా హారిస్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి దిగిన వారం రోజుల్లోనే తాము 200 మిలియన్ డాలర్లు (20 కోట్ల డాలర్లు) వసూలు చేశామని ‘టీమ్ హారిస్’ చెబుతోంది.  


వారంలో 200 మిలియన్ డాలర్లు 
జో బిడెన్ ప్రెసిడెంట్ రేసు నుండి వైదొలగడంతో డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్‌ను తన అభ్యర్థిగా నిర్ణయించింది. కమలా హారిస్ ఫర్‌ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖెల్ టేలర్ మాట్లాడుతూ.. 'జో బిడెన్ అధ్యక్ష రేసు నుండి వైదొలిగిన తర్వాత, టీమ్ హారిస్ ఒక వారంలో రికార్డు స్థాయిలో  200మిలియన్ డాలర్లను సేకరించింది. ఇందులో 66 శాతం మొత్తాన్ని మొదటి సారి దాతల నుంచి సేకరించారు.  వైస్ ప్రెసిడెంట్ కు అట్టడుగు స్థాయి నుంచి కూడా విపరీతమైన మద్దతు లభిస్తోందని ఇది రుజువు చేస్తోంది. అదేవిధంగా 1.70 లక్షల మంది కొత్త వాలంటీర్లు ప్రచార పర్వంలో చేరారు.’ అని అన్నారు. అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలిచి వారమే అయినప్పటికీ.. డెమోక్రాట్ల మద్దతు పొందినట్లు టేలర్ చెప్పారు. రికార్డు స్థాయిలో నిధుల సేకరణ మొదలు.. పెద్దఎత్తున వాలంటీర్లను కూడగట్టడం వరకు.. ట్రంప్- వాన్స్ జోడీని ఓడించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.  కమలా హారిస్‌ కు లభిస్తున్న మద్దతు చూసి ట్రంప్‌ భయపడుతున్నట్లు పేర్కొన్నారు.


ఉత్సాహంగా కమలా హారిస్ ప్రచారం
కమలా హారిస్ పట్ల దేశవ్యాప్తంగా ఉత్సాహం కనిపిస్తోందని టేలర్ అన్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు, కార్మికులు, బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా నుండి మద్దతు లభించిన తరువాత కమలా హారిస్ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా సాగుతుందన్నారు.   కమలా హారిస్ అభ్యర్థిత్వానికి సంబంధించి డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఏకమైందని టేలర్ పేర్కొన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కమలా హారిస్ అందరి విశ్వాసాన్ని చూరగొన్నారని తెలిపారు.  ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయమే మిగిలి ఉంది. అందుకే.. దేశవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తాం. ఈ వారాంతంలోనే 2300కుపైగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టేలర్ తెలిపారు.  నవంబర్లో జరగబోవు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని కమల హారిస్ ఇప్పటికే ప్రకటించారు.


నెట్ ఫ్లిక్స్ భారీ విరాళం
కమలా హారిస్‌కు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హేస్టింగ్స్‌ భారీ విరాళం ఇచ్చారు. ఏకంగా రూ.58.6 కోట్లు (7 మిలియన్ల  డాలర్లు) ఇచ్చినట్లు సమాచారం. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటివరకూ హేస్టింగ్స్‌ ఇచ్చిన పెద్ద మొత్తం ఇదే. ‘నిరాశకు గురి చేసిన బైడెన్‌ డిబేట్‌ తర్వాత మేం మళ్లీ ఆటలోకి వచ్చాం’ అని కమలా హారిస్‌ను ఉద్దేశించి హేస్టింగ్స్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని ట్రంప్‌ మద్దతుదారులు జీర్ణించుకోలేక ‘నెట్‌ఫ్లిక్స్‌’ను బహిష్కరించాలంటూ ప్రచారం చేస్తున్నారు.