Kamal Nath Switchover: మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కి పెద్ద ఝలక్‌ ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరతారంటూ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కమల్‌నాథ్ టికెట్ అడిగారని, అందుకు హైకమాండ్ అంగీకరించలేదని సమాచారం. అందుకే...ఆయన అధిష్ఠానంపై అలకతో పార్టీని వీడిపోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్‌ కమల్‌నాథ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించడం లేదని, ఇది కూడా ఆయనను మరింత ఇబ్బంది పెడుతోందని సమాచారం. రాజ్యసభ టికెట్ విషయంలో విభేదాలు వచ్చిన తరవాతే ఆయన పార్టీ మారే ఆలోచన చేసినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే...కమల్‌నాథ్‌తో పాటు ఆయన కొడుకు నకుల్‌ నాథ్‌ కూడా కాంగ్రెస్‌ని వీడే యోచనలో ఉన్నారు. తండ్రికొడుకులు ఇద్దరూ ఒకేసారి పార్టీకి షాక్ ఇస్తారా అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. దీనికి తోడు కమల్‌నాథ్ ఢిల్లీకి వెళ్లడం మరింత ఆసక్తిని పెంచింది. ఆ తరవాత మీడియా ఆయనను దీనిపై క్లారిటీ అడిగింది. అందుకు ఆయన "అంత తొందరెందుకు..అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీకే చెబుతాను" అని సమాధానం దాట వేశారు. 


"నేను అవును అనలేను. కాదనలేను. మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మీరు అనవసరంగా ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. నాకు ఎటో వెళ్లిపోవాలనే ఉత్సాహం లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే కచ్చితంగా ముందు మీకే చెబుతాను"


- కమల్‌ నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత 


అయితే...కాంగ్రెస్ మాత్రం కమల్ నాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో సీఎం ఎవరు అవ్వాలన్న చర్చ వచ్చినప్పుడు సిందియాని కాదని కమల్‌నాథ్‌కి అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కానీ...ఆ తరవాత ఆయన నిర్లక్ష్యం వల్లే కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో పతనమైపోయిందన్న విమర్శలూ వినిపించాయి. 


మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా అకౌంట్స్‌లో కాంగ్రెస్ లోగోని తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారా అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ నేతలు కూడా హింట్ ఇస్తున్నారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ వీడీ శర్మ స్పష్టం చేశారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతల్ని అడ్డుకుందని, ఈ విషయంలో చాలా మంది అసహనంగా ఉన్నారని వెల్లడించారు. అలాంటి వాళ్లంతా బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. కొంత మంది సీనియర్ నేతల్ని కూడా ఆ పార్టీ అవమానిస్తోందని విమర్శించారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో కొంత మంది కీలక నేతలు కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే దినేష్ అహిర్‌వర్‌తో పాటు మరో ముఖ్య నేత ఫిబ్రవరి 12న బీజేపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ లాంటి నేత పార్టీని వీడతారన్న వార్తలు సంచలనం అవుతున్నాయి.


Also Read: పాపులర్ సీఎం లిస్ట్‌లో రెండో స్థానానికి యోగి ఆదిత్యనాథ్, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదెవరో తెలుసా?