Kakinada News: కాకినాడలోని జేఎన్టీయూ తొమ్మిదో స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. పోలీసు బలగాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ కులపతి హోదాలో పాల్గొన్నారు. ఉదయం నుంచి వర్సిటీలో పతకాలు అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విశ్వ విద్యాలయ ప్రాంగణం అంతా సందడిగా మారింది.
ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్.
గ్రాడ్యుయేషన్ డే అంటే యూనివర్సిటీతో సంబంధం ముగించడం కాదని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఇంటర్నల్ స్టూడెంట్ యూనివర్సిటీని విడిచి పెట్టి ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారని, శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అధ్యయనం చేస్తే ఇంజినీర్లు నవ ప్రపంచాన్ని సృష్టిస్తారన్నారు. సైన్స్ రంగంలో పీహెచ్ డీ లు పొందిన వారి సంఖ్యలో యూఎస్, చైనా తర్వాత మనదేశం మూడవ స్థానంలో నిలిచిందని చెప్పారు. స్టార్టప్స్ సంఖ్య పరంగా 3వ స్థానంలో ఉన్నామన్నారు. జీవితంలో గొప్ప సంతృప్తి ఏదైనా ఉందంటే.. అది సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారానే వస్తుందన్నారు. దాదాపు 20 నిముషాల పాటు గవర్నర్ ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రేరణ కలిగించేలా ప్రసంగం సాగింది. అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ కాకినాడ స్థిర పడిందన్నారు. ఇటీవలే న్యాక్ ఏప్లస్ గుర్తింపు పొంది మరింత ఖ్యాతి సాధించిందని కొనియాడారు.
విద్యకు అగ్ర స్థానం: బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం దాదాపు రూ.30 వేల నుంచి రూ.40వేల కోట్ల వరకూ వెచ్చిస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తున్నామని మంత్రి బొత్స వివరించారు. విద్యకు పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ వృథా కాబోదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. పిల్లల చదువు బాగుంటే రేపు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం పరిస్థితి కూడా చాలా బాగుంటుందని అన్నారు. జేఎన్టీయూ వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రసాద రాజు వర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్ డీలు ప్రధానం చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీత, శాసన సభ్యులు ద్వారం పూడి చంద్రశేఖర రెడ్డి, కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, వర్సిటీ ఉన్నత ఉద్యోగులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.