KA Paul at Janasena Office: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వివిధ పార్టీల అధినేతలను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. తొలుత తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి కేఏ పాల్ ప్రయత్నించగా.. అక్కడ పోలీసులు ఆయన్ను నిలిపివేశారు. చేసేదిలేక కేఏ పాల్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం జనసేన కార్యాలయానికి కూడా కేఏ పాల్ వెళ్లారు. అక్కడ ఆయన దాదాపు అరగంట నుంచి గేట్ బయట ఉండి వేచి చూశారు. 


పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని కేఏ పాల్ అక్కడ వేచి ఉన్నారు.  ఈ విషయం జనసేన కార్యాలయ సిబ్బందికి కేఏ పాల్ చెప్పినప్పటికి వారు లోనికి అనుమతించలేదు. తన మాస్టర్ ప్లాన్ వింటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటూ జనసేన కార్యాలయం సిబ్బందితో పాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోజూ తనని ఒత్తిడి చేస్తున్నారని.. ఎలాగైనా తమ హీరో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని బతిమాలుతున్నారని పాల్ అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ ను కలవడం కోసం వచ్చానని పాల్ చెప్పారు.


తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ను కలిసే వెళ్తా అంటూ కారులోనే భీష్మించుకుని కేఏ పాల్ కూర్చున్నారు. తీరా జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో కేఏ పాల్ వెనుదిరిగారు.