National Sports Awards 2023:  షట్లర్లు చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌, క్రికెటర్‌ మహ్మద్‌ షమీసహా  26మంది అథ్లెట్లు, పారా అథ్లెట్లు...జాతీయ క్రీడా పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం చేశారు. 2023 సంవత్సరానికిగాను షట్లర్లు చిరాగ్‌, సాత్విక్‌లు...ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు అందుకున్నారు. చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌  ఆర్‌.వైశాలీ, పిస్టల్‌ షూటింగ్‌ సెన్సేషన్‌ ఈషా సింగ్‌, రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌, బాక్సర్‌ మహమ్ముద్‌ హుస్సాముద్దీన్‌, పారా ఆర్చర్‌ సీతల్‌ దేవీ తదితరులు అర్జున అవార్డు, చెస్‌ కోచ్‌, ప్రజ్ఞానందా గురువు రమేశ్‌ ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుకు 25లక్షలు, అర్జున,ద్రోణాచార్య అవార్డుకు 15 లక్షల నగదు, మెమెంటో ప్రదానం చేశారు. సాధారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి అయిన ఆగస్టు 29న జరగాల్సి ఉండగా...గతేడాది హాంగ్జౌలో సెప్టెంబర్‌ 23నుంచి అక్టోబర్‌ 8వరకు  ఆసియా క్రీడలు జరగటంతో వాయిదా వేశారు.


జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం


జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భవన్‌లో జరిగింది. ద్రోణాచార్య అవార్డులను తొలిసారిగా ప్రదానం చేశారు. చెస్‌ కోచ్‌, ప్రజ్ఞానందా గురువు రమేశ్‌ ద్రోణాచార్య పురస్కారం అందుకున్నారు. అలాగే గోల్ఫ్ కోచ్ జస్కీరత్ సింగ్ గ్రేవాల్, భాస్కరన్ ఇ (కబడ్డీ, కోచ్), జయంత్ కుమార్ పుసిలాల్ (టేబుల్ టెన్నిస్, కోచ్)లకు లైఫ్ టైమ్ అవార్డు లభించింది. గణేష్ ప్రభాకరన్ (మల్లాఖాంబ్), మహావీర్ సైనీ (పారా అథ్లెటిక్స్), లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్‌బి రమేష్ (చెస్), శివేంద్ర సింగ్ (హాకీ)లకు అతిపెద్ద కోచింగ్ గౌరవం ద్రోణాచార్య అవార్డు లభించింది.


సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టికి ధ్యాన్ చంద్ అవార్డు 


ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో నెంబర్ వన్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. వీరు ఆసియా క్రీడలలో స్వర్ణం , ఆసియా ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు.  ఈ జంట ఇండోనేషియా సూపర్ 1000, కొరియా సూపర్ 500, స్విస్ సూపర్ 300 టైటిళ్లను కూడా గెలుచుకున్నారు.  వీరిద్దరూ భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. 


అర్జున అవార్డు అందుకున్న షమీ 


గత ఏడాదిలో ఐసీసీ వరల్డ్ కప్‌లో సంచలన బౌలింగ్ చేసిన ష‌మీ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి  అర్జున అవార్డుకు సిఫారసు చేసింది.  భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ(Mohammed Shami).. ప్రదర్శన క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అది మాములు ప్రదర్శన. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు.


ఈసారి మొత్తం 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు లభించింది. సాత్విక్ రంకిరెడ్డితోపాటు అర్జున అవార్డు అందుకున్న అజయ్ కుమార్, తెలంగాణ షూట‌ర్ ఇషా సింగ్ సైతం తెలుగువారు  కావడం విశేషం. అంధుల క్రికెట్లో భారత జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి.  గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. చిన్నతనంలో కంటి చూపు కోల్పోయారు. 2010లో భారత జట్టులో చోటు దక్కించుకున్న అజయ్ కుమార్.. 2012లో జరిగిన అంధుల టీ20 వరల్డ్ కప్‌, 2014లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2016లో అతడు భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు.