Jyotiraditya Scindia Taunts Rahul Gandhi:


రాహుల్‌పై సెటైర్లు..


త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాల తరవాత బీజేపీ కాంగ్రెస్‌పై విమర్శల డోసుని పెంచింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ సెటైర్లు వేయగా..ఇప్పుడు మరో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా రాహుల్‌పై విరుచుకు పడ్డారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి రాహుల్ గాంధీయే కారణమని అన్నారు. రాహుల్ గాంధీ పదేపదే లుక్స్ మార్చుతున్నారని, ఇంకేమైనా మిగిలి ఉంటే అవి కూడా చూపించాలంటూ సెటైర్లు వేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన..ఈ వ్యాఖ్యలు చేశారు. 


"దేశమంతా రాహుల్ గాంధీని పక్కన పెట్టేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పని అయిపోయినట్టే అనిపిస్తోంది. రాహుల్ గాంధీని, భారత్ జోడో యాత్రను ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోలేదు అనడానిక ఈ ఫలితాలే నిదర్శనం. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఏడాది చివర్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు కూడా మరోసారి కాంగ్రెస్ ఓడిపోక తప్పదు" 


జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి 


ఇదే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు సింధియా. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ సారి మధ్యప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూడా భేషుగ్గా ఉందంటూ కితాబునిచ్చారు. గ్వాలియర్‌లోని జలల్‌పూర్ హైవే సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్‌ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. థీమ్ రోడ్‌ నిర్మాణ పనులను పరిశీలించిన సింధియా...నాణ్యత విషయంలో అసహనం వ్యక్తం చేశారు. 


అనురాగ్ ఠాకూర్ ఫైర్..


రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలందరిపైనా గుట్టుగా నిఘా పెడుతున్నారంటూ పెగాసస్‌ కేసుని ప్రస్తావించారు. దేశం అన్వయించుకోడానికి వీల్లేని విధానాలు బలవంతంగా రుద్దుతున్నారంటూ మండి పడ్డారు. పెగాసస్‌ గురించి చెబుతూ తన  ఫోన్‌లోనూ పెగాసస్ వైరస్ ఉందని, ఇదే విషయం అధికారులు చెప్పారని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"నిన్నటి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో రాహుల్ గాంధీకి ముందే తెలుసు. కాంగ్రెస్‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పెగాసస్ ఆయన ఫోన్‌లో కాదు. ఆయన మెదడులోనే ఉంది. బహుశా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఏం చెప్పిందో రాహుల్ విన్నట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాని మోదీని గౌరవిస్తున్నారని చెప్పారు. తన మొబైల్‌లో పెగాసస్ ఉందన్న అనుమానం ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు. విదేశాల్లోనే ఉన్న స్నేహితులతో  చేతులు కలిపి దేశ పరువుని దిగజార్చేలా మాట్లాడుతున్నారు"


అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


Also Read: Sonia Gandhi Hospitalised: మరోసారి ఆసుపత్రి పాలైన సోనియా గాంధీ, ఆరోగ్యంగా నిలకడగా ఉందన్న వైద్యులు