ద్రౌపది ముర్ముపై ప్రశంసల జల్లు 


ఎన్‌డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని నిలబెట్టినప్పటి నుంచి భాజపా మద్దతుదారులంతా అధిష్ఠానాన్ని తెగ పొగిడేస్తున్నారు. చాలాగొప్ప వ్యక్తిని, చరిష్మా ఉన్న నేతను బరిలోకి దింపారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కేంద్రం కూడా ద్రౌపది ముర్ము ఎంతో విజనరీ ఉన్న నేత అని ఆకాశానికెత్తేస్తోంది. అటు ఝార్ఖండ్ ప్రజలూ ద్రౌపది ముర్ము సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు ఝార్ఖండ్‌కి గవర్నర్‌గా ఉన్నారామె. ఆ రాష్ట్ర నేతలూ ద్రౌపది ముర్ముని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఎంతో మృదు స్వభావి అని, ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడేవారని, ఎంతో వినయంగా ఉండే వ్యక్తి అని అంటున్నారు. గిరిజన తెగకు చెందిన నేతగా, ఆ వర్గ ప్రజల్లోని భయాందోళనలు పోగొట్టే ప్రయత్నం చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. 


విలువలు, వినయం ఉన్న వ్యక్తి.. 


ఝార్ఖండ్‌లోని ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు రతన్ తిర్కే, ద్రౌపది వర్మ గవర్నర్‌గా పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. పతల్‌గడీ ఉద్యమం సహా కౌలు చట్టాల సవరణల సమయంలో గిరిజనులు ఎంతో అభద్రతా భావానికి లోనయ్యారని, అప్పుడు ద్రౌపదిముర్ముతో చర్చలు జరిపామని చెప్పారు రతన్ తిర్కే. ప్రభుత్వంతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపించారని, కౌలు చట్టం బిల్లు పాస్అవకుండా చూశారని అన్నారు. ఏదైనా ఓ అంశంపై లోతైన చర్చ జరిపేందుకు అధికారులకు అవకాశం కల్పించేవారని వివరించారు. గిరిజనులకూ గవర్నర్‌ను కలిసే అవకాశం కేవలం ద్రౌపది ముర్ము హయాంలోనే వచ్చిందని, ఇకపైనా ఆమె ఆ తెగ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఝార్ఖండ్ భాజపా మీడియా కో ఇన్‌ఛార్జ్ అశోక్ బరైక్. 


భర్తను, ఇద్దరు కొడుకులను పోగొట్టుకుని..


సంతల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ఒడిశాలోని రాయ్‌రంగపూర్ పంచాయతీ కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.తరవాత భాజపా ఎస్‌టీ మోర్చా ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో వాణిజ్య, రవాణ, మత్స్య శాఖల మంత్రిగా పని చేశారు ద్రౌపది ముర్ము. 2015లో ఝార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. 2021 వరకూ అదే పదవిలో కొనసాగారు. ఒకే ప్రమాదంలో భర్తను, ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నారు. ఈ  విషాదం నుంచి కోలుకుని మళ్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా ద్రౌపది ముర్ముకి సన్మానం చేశారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ ద్రౌపది ముర్ముని దూరదృష్టి ఉన్న నేతగా అభివర్ణించారు.