Jharkhand Political Crisis: ఝార్ఖండ్ రాజకీయాలు (Jharkhand Politics) వారం రోజుల్లోనే చాలా నాటకీయంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సోరెన్ తప్పుకోవడం ఆ తరవాత మంత్రి చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా వేగంగా జరిగిపోయాయి. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని సోరెన్ క్యాంప్ గట్టిగానే వాదిస్తోంది. పైగా తమ కూటమి చాలా బలంగా ఉందని, అంత సులువుగా ప్రభుత్వం పడిపోదని తేల్చి చెబుతోంది. అయితే...ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సోరెన్‌కి అసలు పరీక్ష ముందుంది. ఫిబ్రవరి 5వ తేదీన బలపరీక్ష జరగనుంది. ఆరోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ మొదటి రోజే చంపై సోరెన్ ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఝార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్‌కి చేరుకున్నాయి. అక్కడే ఓ రిసార్ట్‌లో Jharkhand Mukti Morcha (JMM) కి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను తరలించారు. బీజేపీ తాయిలాలకు లొంగిపోకుండా వాళ్లను కాపాడుకుంటామని JMM ఇప్పటికే స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు కావాలనే ఇలా రాష్ట్ర రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నారని బీజేపీపై ఇప్పటికే మండి పడ్డారు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 41 సీట్ల మేజిక్ ఫిగర్‌ని సాధించాలి. అందుకే...40 మంది ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకుంటోంది JMM.


"ఇలా ఉన్నట్టుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పదవి నుంచి దిగిపోవడం అనూహ్య పరిణామం. అందుకే...కూటమిలోని నేతలంతా కలిసి హేమంత్ సోరెన్ తరవాత ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థమైన నాయకుడిని ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన (చంపై సోరెన్) ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. మా ఎమ్మెల్యేలందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటాం"


- గులామ్ అహ్మద్ మీర్, ఝార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ 


బలపరీక్షపై విశ్వాసం..


బలపరీక్షపై ముఖ్యమంత్రి చంపై సోరెన్ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి హేమంత్ సోరెన్ ఎంతో కృషి చేశారని, తప్పకుండా మళ్లీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకముందని తేల్చి చెప్పారు. 


"మా కూటమి చాలా బలంగా ఉంది. గిరిజనుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం హేమంత్ సోరెన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ప్రతిపక్షం ఆయనను అంతగా వేధించింది. తప్పుడు కేసులు పెట్టి ఆయనను జైలుకి పంపించింది. ఏదేమైనా మేం కచ్చితంగా బలపరీక్షలో నెగ్గుతాం"


- చంపై సోరెన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి 






Also Read: H1B Visa: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు, ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి!