ఆదేశాల్లేకుండానే సెలవు తీసుకుంటారా?
ఝార్ఖండ్‌లోని దుమ్‌కా జిల్లాలో 33 ప్రభుత్వ పాఠశాలలకు ఇకపై ఆదివారం సెలవు ఉండదు. అందుకు బదులుగా శుక్రవారం వీక్లీఆఫ్‌గా మారనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత జిల్లా అయిన దుమ్‌కాలో ఇది అమలు చేయనున్నారు. అయితే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకటనపై విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏయే స్కూల్స్‌కైతే శుక్రవారం సెలవు అని ప్రకటించారో..అవన్నీ ఉర్దూ పాఠశాలలే కావటం చర్చకు దారి తీసింది. డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంజయ్ కుమార్ దాస్, ఈ అంశంపై స్పందించారు. 33 స్కూల్స్‌కి సంబంధించిన విద్యాధికారులకు లేఖలు రాశామని, సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యాశాఖ ఆయా స్కూల్స్‌కి "శుక్రవారం" సెలవు తీసుకోమని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిశాక, విచారణ మొదలు పెడతామని అంటున్నారు.
2015 నుంచే శుక్రవారం సెలవు..?
గత వారం ఝార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్‌నాథ్ మహతో చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆదివారానికి బదులుగా శుక్రవారం సెలవు ఇస్తున్నారన్న అంశం తన దృష్టికి వచ్చిందని అన్నారు జగర్‌నాథ్. వెంటనే దీనిపై దృష్టి సారించిన అధికారులు ఆయా ప్రాంతాలకు చెందిన విద్యాధికారులు సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా ఇందుకు సంబంధించిన రిపోర్ట్ అందించాలని విద్యాశాఖ మంత్రి ఆర్డర్ వేశారు. 2015 నుంచి ఆ ప్రాంతాల్లోని పాఠశాలలకు శుక్రవారమే సెలవు ఇస్తున్నారని ఓ స్కూల్ ప్రిన్సిపల్ వెల్లడించారు. ఇప్పటి వరకూ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాకపోవటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.