Jayalalithaa Death Case:
ఒక రిపోర్ట్..ఎన్నో అనుమానాలు..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మరోసారి రాజకీయ రగడ నడుస్తోంది. జయలలిత మరణానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలు శశికళను అనుమానించే విధంగా ఉన్నాయంటూ అరుముగసామి కమిటీ ఓ నివేదిక వెలువరించింది. శశికళపై తీవ్ర ఆరోపణలు చేసింది. జయ మరణించారని చెప్పటానికి ఓ రోజు ముందే గుండె ఆగిపోయిందని, ఈ విషయంలోనే అనుమానాలున్నాయని నివేదిక తెలిపింది. జయలలిత చికిత్సలో శశికళ జోక్యం చేసుకున్నారనీ చెప్పింది. దీనిపై...శశికళ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. "నాపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఆ నివేదిక అంతా తప్పుల తడక. జయలలిత వైద్యం విషయంలో నేనెలాంటి జోక్యం చేసుకోలేదు. దీనిపై విచారణకైనా నేను సిద్ధమే" అని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో అరుముగసామి నివేదిక ప్రకంపనలు సృష్టించింది. శశికళను కచ్చితంగా విచారించాల్సిదేనని తేల్చి చెప్పింది. మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ సహా మాజీ హెల్త్ సెక్రటరీ రాధకృష్ణన్, డాక్టర్ శివకుమార్‌నూ విచారించాలని స్పష్టం చేసింది. అంతకు ముందు ఈ ప్యానెల్...నివేదికను ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌కు అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. 2016లో సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. అప్పటి నుంచి ఆమె మరణించిన వరకూ ఏం జరిగిందో తేల్చి చెప్పాలని ఆదేశించింది స్టాలిన్ సర్కార్. అయితే...శశికళే నిందితురాలు అని తేల్చి చెప్పలేదు నివేదిక. కేవలం అనుమానిస్తున్నట్టుగానే వెల్లడించింది.
తేదీల్లో మార్పులేంటి..?
ఇక్కడ కీలకంగా చర్చకు వస్తున్న అంశం ఒక్కటే. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనారోగ్యానికి గురైతే...ఇక్కడ వైద్యం అందించలేకపోతే ఆమెను విదేశాలకు తరలించి ఉండొచ్చు కదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. డాక్టర్ రిచర్డ్ బీల్ అందుకు సిద్ధం
అని చెప్పినా...ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించింది నివేదిక. ఆమె గుండె జబ్బుతో బాధపడుతున్న సమయంలో ఆంజియో ఎందుకు చేయించలేదనీ అడిగింది. అపోలో ఆసుపత్రిలోని సీనియర్ కార్డియాలజిస్ట్ వైవీసీ రెడ్డి, డాక్టర్ బాబు అబ్రహం, శివకుమార్..బాంబే, యూకే, యూఎస్ నుంచి వైద్యులను పిలిపించాలని ప్రయత్నించారు. సర్జరీ చేయాలని అనుకున్నారు. కానీ...తరవాత కొందరి ఒత్తిడి కారణంగా...ఆ పని చేయలేకపోయారని, కావాలనే ఈ విషయంలో జాప్యం చేశారని ఆరోపించింది నివేదిక. అందుకే..దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పింది. ఇప్పటికే దీనిపై నలుగురిని విచారించగా...ఆ నలుగురూ...జయలలిత డిసెంబర్ 4న మృతి చెందారనే చెప్పారు. అయితే...ఆమె డిసెంబర్ 5న చనిపోయారని అంతా ప్రకటించారు. ఈ విషయంలో స్పష్టత కోసమే విచారణ అవసరమని అంటోంది..అరుముగసామి నివేదిక. మొత్తంగా...ఈ రిపోర్ట్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. శశికళ వర్గం DMKపై తీవ్రంగా మండిపడుతోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తోంది. శశికళ వర్గానికి చెందిన వాళ్లు అసెంబ్లీకి సమీపంలో నిరసనలూ చేపట్టారు. పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేశారు. శశికళనూ ఈ విషయంలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Congress President Election Result: కాంగ్రెస్ కెప్టెన్ ఎవరో తేలేది ఇవాళే, కొనసాగుతున్న కౌంటింగ్