Great Himalayan Earthquake: మయన్మార్‌లో ఇటీవలే వచ్చిన భీకర భూకంపం రెండు వేల మంది ప్రాణాలు తీసింది. కొన్నివేల మందిని నిరాశ్రయులను చేసింది. మన పొరుగునే జరిగిన ఈ ప్రకృతి వైపరిత్యం ప్రభావం ఈశాన్య ప్రాంతంలో కనిపించింది. ఇప్పుడు జపాన్‌కు అతి భారీ భూకంపం.. మెగా క్వేక్ రాబోతుందనే అంచనాలు కలవరపాటుకు గురిచేస్తుండగా.. ఆ తర్వాత వంతు ఇండియాదే అన్న అంచనాలను సెస్మాలజిస్టులు ఇ్తస్తున్నారు. గ్రేట్ హిమాలయన్ ఎర్త్‌క్వేక్ లైన్‌లోనే ఉందని వాళ్లు హెచ్చరికలు చేస్తున్నారు.

జపాన్‌కు అలెర్ట్

మయన్మార్ భూకంపం వచ్చి ఎన్నోరోజులు కాలేదు. భూకంప కేంద్రం బర్మాలోనే ఉన్నా.... దాని ప్రభావం థాయ్‌లాండ్, అరుణాచల్ ప్రదేశ్ వరకూ కనిపించింది. ఇదిలా ఉండగానే జపాన్‌కు భారీ అలెర్ట్ వచ్చింది. జపాన్‌లోని నంకై ట్రఫ్ వద్ద సంభవించే ఒక మెగాక్వేక్ గురించి  జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇది ఎంతటి తీవ్రమైనదంటే.. దాదాపు 9 మాగ్నిట్యూడ్‌తో సంభవించే ఈ భూకంపంతో  భారీ సునామీ రావచ్చని 100 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని .. ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.  ఈ భూకంపంతో 3 లక్షల  ప్రాణాలకు ముప్పు అని భావిస్తన్నారు. జపాన్‌లో నైరుతి పసిఫిక్‌లో వచ్చే ఈ  ఈ భీకర సునామీతో వేలకొద్దీ భవనాలు నేలకొరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ  తాజా హెచ్చరికలతో  జపాన్ ప్రభుత్వం  తన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలను మార్చుకుంటోంది. 2013 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.

జపాన్‌లో సన్నద్ధత

నంకై ట్రఫ్‌లో 9 తీవ్రత కలిగిన భూకంపం  శక్తిని జపాన్ కెబినెట్ కమిటి అంచనా వేస్తోంది  దేశంలోని  ప్రతి ప్రాంతంలో వరదలు మరియు సునామీల ప్రమాదాన్ని నిర్ధారించారు. ఈ భూకంపం  సంభవిస్తే.. జపాన్ ఆర్థిక వ్యవస్థకు 1.8 ట్రిలియన్  డాలర్ల నష్టం వాటిల్లవచ్చని, జీడీపీలో దాదాపు సగం పోతుందని కూడా భయపడుతున్నారు. 2011లో జరిగిన 9 తీవ్రత గల భూకంపం, భారీ సునామీని సృష్టించి, ఈశాన్య జపాన్‌లోని ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో మూడు రియాక్టర్లను కరిగించి, 15,000 మందికి పైగా మరణాలకు కారణమైంది.

గ్రేట్ హిమాలయన్ ఎర్త్‌క్వేక్

ఎక్కడో జపాన్‌లో జరిగే ప్రమాదం గురించి ఊహిస్తేనే భయంకరంగా అనిపిస్తోంది. కానీ అదే స్థాయి ప్రమాదం మనకు కూడా ఉంది. మొత్తం హిమాలియన్ రీజియన్ ఓ టైంబాంబ్‌పై కూర్చుందని భూకంప అధ్యయన నిపుణులు చెబుతారు. హిమాలయ ప్రాంతంలో 8 పాయింట్లు లేదా అంతకంటే  తీవ్రమైన భూకంపం ఎప్పుడైనా సంభవించవచ్చు. ఈ భూకంపం చండీగఢ్, డెహ్రాడూన్, ఢిల్లీ వంటి నగరాలను ప్రభావితం చేయవచ్చు. 1905లో  హిమాలయన్ ప్రాంతంలో వచ్చిన కాంగ్రా భూకంపంలో 20వేల మంది చనిపోయారు. అలాంటిది మళ్లీ వస్తే.. ఈసారి 2లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. సెంట్రల్ హిమాలయన్ రీజియన్‌లోని  కుమావున్-గర్హ్వాల్ వంటి ప్రాంతాలు ఎప్పుడో ఒక పెద్ద భూకంపానికి సిద్ధంగా ఉన్నాయని సెస్మాలిజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకింత ఆందోళన

భారత్‌.. టిబెట్‌ ప్లేట్‌ కిందకు వెళుతోంది. అయితే ఇది స్మూత్‌గా జరగడం లేదు. చాలా ఏళ్లుగా జరుగుతున్న ఈ ఘర్షణ కచ్చితంగా ఓ పెద్ద భూకంపానికి దారి తీస్తుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే.. హిమాలయన్ పలకల మధ్య ఫాల్ట్స్… ఓ పెద్ద ఎర్త్‌ క్వేక్‌ను ప్రేరేపిస్తున్నాయి. హిమాలయన్ భౌగోళిక పరిస్థితుల ప్రకారం అక్కడ తరచుగా భూకంపాలు రావలసి ఉంది. అయితే అప్పట్లో వచ్చిన నేపాల్ భూకంపం తర్వాత  మళ్లీ ఆ స్థాయిలో రాలేదు. భూకంపాల మధ్య గ్యాప్ పెరిగే కొద్దీ దాని తీవ్రత ఎక్కువుగా ఉంటుంది.

భారత్ సన్నద్ధం కావాల్సిన అవసరం

భారత ఎమర్జెన్సీ సర్వీసులు ఈ ప్రమాదాల గురించి తెలుసుకున్నప్పటికీ,  నష్టాన్ని తగ్గించడానికి తగిన సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. జపాన్ తన రక్షణలను బలోపేతం చేస్తున్నట్లే, భారత్‌ కూడా ఇలాంటి విపత్తులకు సిద్ధంగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. టెక్టానిక్ ఒత్తిడి పెరుగుదల కారణంగా, ప్రతి 100 నుండి 150 సంవత్సరాలకు ఒక మెగాక్వేక్ సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. కాంగ్రా భూకంపం వచ్చి దాదాపు 120 ఏళ్లు అవుతోంది. కాబట్టి భారత్‌ మరో విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావలసి ఉంది.