Karumuri Nageswara Rao issues: గుంటూరు ఇవతల వారిని ఇళ్లలోంచి లాగి కొడతాం -  అవతల వారిని అడ్డంగా నరుకుతామని వైసీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  “మన ప్రభుత్వమే వస్తుంది” అని..  “గుంటూరు అవతలవారిని నరికేస్తాం... ఇవతలవారిని ఇంటి నుంచి లాక్కొచ్చి కొడతాం” అని వ్యాఖ్యలు చేశారు.

ఈ వీడియోను టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.  జగన్‌ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినా, వైసీపీ నేతల్లో అధికార మదం ఇంకా దిగలేదని.. వారి నేర ప్రవృతికి ఇదే నిదర్శనం అన్నారు.                       

కారుమూరి నాగేశ్వరరావు వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రైతుల్ని ఎర్రిపప్పలు అని తిట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆయన ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థం అని చెప్పారు. దాంతో అందరూ ఆయనను ఎర్రిపప్పా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆయనపై టీడీపీ స్కాం ఆరోపణలు తుణుకులో ఉన్నాయి.  2020-21 ఏడాదిలో తణుకు పట్టణానికి సమీపంలో వీరభద్రాపురం-కొమరవరంరోడ్డులో గ్రీన్ ఫీల్డ్ జోన్‌లో ఉన్న వ్యవసాయ భూములను తన బినామీలతో కారుమూరి కొనుగోలు చేయించారని ఆరోపణలున్నాయి.ఈ స్కాంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 

కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరికలపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. బహిరంగంగా చంపుతామని హెచ్చరిస్తున్న ఆయనపై కేసులు పెట్టాలని కోరుతున్నారు. 

కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఇతర వైసీపీ నేతలు రెచ్చగొట్టి.. హింస జరిగేలా చేసి..రాష్ట్రంలో పరిస్థితులు దిగజార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం  చేస్తున్నారు. ఇప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని.. పెట్టుబడులు వస్తున్నాయని ఇలాంటి సమయంలో అధికార పార్టీ నేతల్ని ఇలా హెచ్చరించడం ద్వారా వారిలో ఎవరైనా ఆవేశంగా ఏదైనా చేస్తే.. వెంటనే దాన్ని జాతీయ స్తాయి ఇష్యూగా చేసి.. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని ప్రచారం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.