Leopard Whacked With Axe : పులి వేటాడుతూంటే మనుషులు పారిపోవడమే కానీ ఎదురునిలబడితే ప్రాణాలు దక్కడం కష్టం. సినిమాల్లో మాత్రమే పులిని హీరో చంపేస్తాడు. కానీ బయట అలా వేటాడే పులిని చంపేసినా అతను హీరో కాడు.. విలనే అవుతాడు. ఈ విషయం పక్కన పెడితే ఇలాంటి ఘటన నిజంగానే ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.                                                 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ అనే ఊళ్లో విస్తారంగా గోధుమ పంట పండుతుంది. ఎటు చూసినా గోథుమ పొలాలు ఉంటాయి. అలాంటి పొలాల మధ్య కొంత మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో పొలాల నుంచి వచ్చిన ఓ చిరుతపులి వారిపై దాడి చేసింది. దాంతో అందరూ చెల్లా చెదురు అయ్యారు. అందరూ పారిపోతే ఎవరో ఒకరి వెంట పడుతుంది. దొరికిన వారి మెడ పట్టుకుని చీల్చేస్తుంది. అందుకే అందరూ పారిపోయినా ఓ వ్యక్తి మాత్రం అక్కడే నిలబడ్డాడు.. చేతికి దొరికిన గొడ్డలి లాంటి వస్తువుతో నరికి చంపేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆ వ్యక్తి ధైర్యం చూసి చాలా మంది అభినందించారు కానీ..అసలు చట్టం ప్రకారం పులిని అలా చంపడం నేరం కాబట్టి ఫారెస్ట్ అధికారులు విచారణ ప్రారంభించారు.          

నిజానికి అలా చంపిన వ్యక్తి కూడా ఫారెస్ట్ అధికారేనని తర్వాత తేలింది. పొలాల్లో పులి తిరుగుతోందని సమాచారం రావడంతో వివరాలు తెలుసుకోవడానికి ఫారెస్ట్ సిబ్బంది అటు వెళ్లారు. అక్కడే పులిదాడి జరిగింది. పారెస్ట్ సిబ్బందిలో ధైర్యవంతుడైన వ్యక్తి పులి బారి నుంచితనను తాను కాపాడుకోవడానికి చంపేశాడు. కానీ అది నేరం అయిపోయింది. ఆ వ్యక్తి తప్పు చేశాడో.. ఒప్పు చేశాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ చట్టం ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులంటున్నారు.                  

యూపీలోని ఫిలిబిత్‌లో పెద్ద ఎత్తున  పులులు ఉంటాయి. తరచూ అక్కడ పులుల దాడి ఘటనలు జరుగుతూ ఉంటాయి.  అయితే వాటిని సంరక్షించేందుకు అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయినా  పులుల మరణాలు తరచూ జరుగుతూనే ఉంటాయి.