జపాన్‌లో పెరుగుతున్న కేసులు..


ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. జపాన్‌లో ఇటీవలే పాజిటివిటీ రేటు పెరిగింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా..కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే కరోనా చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించటం వల్ల ఆయన టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. స్వల్ప జ్వరం, దగ్గుతో కిషిద బాధపడుతున్నట్టు జపాన్ లోకల్ మీడియా క్యోడో న్యూస్ వెల్లడించింది. నిజానికి ఆయన వారం రోజుల పాటు సమ్మర్ వెకేషన్‌లో ఉన్నారు. సోమవారం నుంచి మళ్లీ విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో కరోనా బారిన పడ్డారు. జపాన్‌లో ఒక్క శనివారమే 253,265 కేసులు నమోదయ్యాయి. అక్కడ వరుసగా మూడు రోజులు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ కరోనా సెవెంత్‌ వేవ్ వ్యాప్తి చెందుతోంది.&





nbsp;


20 ఏళ్ల వారే ఎక్కువ మంది బాధితులు..


టోక్యోలో 25,277 కేసులు నమోదయ్యాయి. గత వారంతో పోల్చితే అదనంగా వెయ్యి కేసులు పెరిగాయి. ఒసాకాలోనూ 23, 098 కేసులు నమోదయ్యాయి. మియాగీ, యమగట, టొట్టొరి, ఒకయమ, తొకుషిమలో రికార్డు స్థాయిలో బాధితులున్నారు. 254 మంది మృతి చెందారు. ఎండాకాలం సెలవుల కారణంగా ప్రజలు బయట తిరగటం, ఎక్కువ మంది గుమిగూడటం లాంటివి చేశారు. ఫలితంగా ఆగస్టు మధ్య నాటికే కేసులు సంఖ్య పెరగటం మొదలైంది. కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా 20 ఏళ్ల వారే ఉన్నారు. 65,అంతకన్నా ఎక్కువ  వయసున్న వారిలో బాధితులు తక్కువగా ఉంటున్నారు. ఒసాకాలో ఇటీవల 28 మంది కరోనాతో మృతి చెందారు. సెవెంత్‌ వేవ్‌లో ఎక్కువగా చిన్న పిల్లలే కొవిడ్ బారిన పడుతున్నారని..అక్కడి వైద్యులు చెబుతున్నారు. దాదాపు 3 లక్షల మంది చిన్నారులు కరోనాతో బాధ పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. 5-11 ఏళ్ల మధ్య  వయసున్న వారికి టీకాలు ఇస్తున్నప్పటికీ..వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కేసులు పెరగటానికి ఇది కూడా ఓ కారణమే. దేశవ్యాప్తంగా దాదాపు 100 నర్సరీ స్కూల్స్‌ సహా మరి కొన్ని విద్యా సంస్థల్నీ మూసివేశారు.  ఎలిమెంటరీ స్కూల్స్ ఇప్పట్లో  తెరుచుకునేలా లేవు. 


త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ


జపాన్ ప్రధాని కిషిద కరోనా బారిన పడటంపై భారత్ ప్రధాని మోదీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.