CCTV Caught Thefts: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను చెన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఉత్తర భారతానికి చెందిన వివిధ వృత్తుల్లో ఉన్న యువకులని పోలుసులు తెలిపారు. అయితే తమ స్వస్థలాలలో దొంగతనం చేస్తే పట్టుబడతామని, అందరికీ తెలిసి పోతామని భయంతో.. దొంగతనాల కోసం దక్షిణ భారత దేశాన్ని ఎంచుకున్నారని అన్నారు. ఒకేసారి ఏటీఎంలను లూటీ చేయడం ద్వారా లక్షాధికారులు అయిపోవాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో ఏటీఎం లూటీ చేయడానికి ప్రయత్నించిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీటీవీల ప్రాముఖ్యత మరోసారి ఈ సంఘటన ద్వారా నిరూపితమైంది.
నేరం జరిగిన విధానం...
ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి చెన్నూర్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలోకి చొరబడి దొంగతం చేయడానికి ప్రయత్నిచారు. అయితే పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. ఏటిఎం మెషిన్ ని పగలగొట్టడం వారివల్ల కాలేదు. ఇక ఎవరైనా గుర్తిస్తారేమో అనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే దొంగతనానికి ప్రయత్నం జరిగిందనే విషయాన్ని గుర్తించిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ నితిన్ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయగా... 17వ తేదీ రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును కూడా ప్రారంభించారు. నేర సమయంలో ఏటీఎంలో 20 లక్షల రూపాయలు ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ పోలీసులకు వివరించడమే కాకుండా ఏటీఎంని పగ లగొట్టే ప్రయత్నం చేసిన దొంగల విషయాన్ని కూడా పోలీసులకు స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్.. సిబ్బందతో సహా చుట్టుపక్కల ఉన్న కెమెరాలను వివిధ కోణాల్లో పరిశీలించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురు వ్యక్తులను కూడా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
ఐదుగురు నిందితుల్లో...
వసీం... మనీష్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా.. మరో ముగ్గురు నిందితులు తమ స్వరాష్ట్రానికి పారి పోయారు. పారిపోయిన నిందితుల్లో రాహుల్ (42), జహీద్ (20 ), జంషీద్ ఖాన్(28 ) ఉన్నారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు అరెస్టయిన నిందితుల వద్ద లభించడంతో... ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాళ్లను కూడా త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. గతంలో మాదిరిగా దొంగతనానికి పాల్పడి తిరిగి ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు... ఆ సొమ్ము ఉపయోగించాలని అనుకున్నారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిపై ఉన్న పాత రికార్డుల ఆధారంగా గతంలో ఏమైనా కేసులు నమోదు అయ్యాయా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్ టి ప్రవీణ్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్, పీసీ మల్లేష్, హెచ్.జి. సదాశివ్, రమేష్ బృందాన్ని మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్... జైపూర్ ఏసీపీ నరేందర్ అభినందించారు. ఇలాగే చాకచక్యంగా వ్యవహిరిస్తూ భవిష్యత్తులో రాబోయే కేసులను ఛేదించాలని సూచించారు. వీలైతే నేరాలు జరగకుండా చూడాలని అన్నారు.