"ఒక్క చాన్స్ ఇవ్వండి...! ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండి. " ఇదేదో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం కాదు. లేటెస్ట్‌గా జనసేనాని పవన్ కల్యాణ్ నోట నుంచి వచ్చిన సరికొత్త పొలిటికల్ నినాదం.  విజయనగరం జిల్లాలోని గుంకలం గ్రామ సరిహద్దులో ఉన్న జగనన్న ఇళ్ళు నిర్మాణ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన పవన్‌...అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఈ కొత్త  నినాదం అందుకున్నారు. 


"ఒక్క చాన్స్ ఇవ్వండి ..అవినీతిరహిత పాలన అంటే ఏమిటో చూపిస్తా..! జేబులో డబ్బు తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టే వాడిని.. అవినీతి చెయ్యను" అంటూ పవన్ చేసిన ప్రసంగం అక్కడి ప్రజలను, ఆయన అభిమానులను ఆకట్టుకోగా..రాజకీయ వర్గాల్లో  ఆశక్తికర చర్చను రేపింది.


2019 ఎన్నికల్లో పాపులర్ అయిన నినాదం 


గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ఏపీలో అత్యంత పాపులర్ అయిన నినాదం "ఒక్క చాన్స్". వైసిపీ ప్లీనరీ నుంచి ప్రశాంత్ కిషోర్ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి అందుకున్న ఈ నినాదం ఏపీలోని మూల మూలకూ చొచ్చుకు పోయింది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ పై సానుభూతిని పెంచడంలో ఈ "ఒక్క చాన్స్" పాత్ర పెద్దదే. అయితే, జగన్ అంటేనే రాజకీయంగా మండిపడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయన వాడిన నినాదాన్ని అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నారు ఎనలిస్టులు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వర్క్ ఔట్ అయిన "ఒక్క చాన్స్ " స్లోగన్..2024లో పవన్ కు కూడా లక్కును తెచ్చి పెడుతుందా...? చూడాలి...!