ఇదెంతో దురదృష్టకరం, సమగ్ర విచారణ జరపాలి: అమర్‌నాథ్ ఘటనపై ఫరూక్ అబ్దుల్లా


బాధిత కుటుంబాలకు పరిహారం అందించండి: ఫరూక్ అబ్దుల్లా 


అమర్‌నాథ్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని జమ్ము, కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా 16 మంది చనిపోవటం, పలువురు గాయపడటం బాధాకరమని అన్నారు. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో టెంట్‌లు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావటం లేదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందనే నమ్మకముందని వ్యాఖ్యానించారు. అక్కడ ఏం జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అభిప్రాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా కొండలపై నుంచి వరద ముంచుకొస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 15 వేల మంది యాత్రికులను పంజ్‌తర్ని క్యాంప్‌కుసురక్షితంగా తరలించారు. వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో పాతిక మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకొంత మంది ఈ వరదల్లోనే చిక్కుకుపోయుంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి. 


బాధితుల్ని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీతో పాటు స్థానిక పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. థర్మల్ ఇమేజర్స్‌తో, రేడార్స్‌తో గాలిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ సహాయక చర్యలు పూర్తయ్యాక కానీ అమర్‌నాథ్
యాత్ర తిరిగి ప్రారంభమయ్యేలా లేదు.