అమెరికా, భారత్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరు వర్గాలు కూడా కెనడా,భారత్‌ల మధ్య దౌత్య వివాదాన్ని అసలు ప్రస్తావించలేదు. మిగతా అన్ని అంశాలపై చర్చ జరిగింది కానీ ఆ విషయంపై మాత్రం ఇరు దేశాలు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు వివిధ రకాల అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు తీవ్రంగా భారత్‌, కెనడాల మధ్‌య నడుస్తున్న వివాదం గురించి మాత్రం ప్రస్తావించలేదు. భారత్‌, కెనడా రెండూ కూడా అమెరికాకు మిత్ర దేశాలే. అయితే ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని గతంలో అమెరికా కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. 


గురువారం ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల్లో భారత దేశం జీ20 సదస్సును నిర్వహించడం, భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనమిక్‌ కారిడార్‌ ఏర్పాటు తదితర కీలక అంశాల గురించి మాట్లాడారని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. వేసవిలో ప్రధాని మోదీ అమెరికా వచ్చారు, మళ్లీ తాను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, జీ20  సదస్సు విజయవంతమయ్యేందుకు అమెరికా మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని జైశకంర్‌ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే బ్లింకన్‌ మాట్లాడుతూ భారత్‌తో చర్చల కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. జీ20, ఐరాస జనరల్‌ అసెంబ్లీ సహా గత కొన్ని వారాలుగా మంచి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇరువురు నేతలు మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలను ఆమోదించలేదు.


 సమావేశం అనంతరం జైశకంర్‌ 'నా స్నేహితుడు, అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ బ్లింకన్‌ను కలవడం చాలా గొప్పగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ పర్యటన సహా ఎన్నో అంశాలపై విస్తృతంగా చర్చించాము. గ్లోబల్‌ డెవలప్‌మెంట్స్‌ పై తమ అభిప్రాయాలను పంచుకున్నాము. త్వరలో జరగబోయే తమ 2+2 సమావేశం ఏర్పాటుకు కావాల్సిన అంశాలను మాట్లాడుకున్నాం' అని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.


'రక్షణ, అంతరిక్షం, క్లీన్‌ ఎనర్జీ రంగాలలో నిరంతరం పరస్పరం సహకారం ప్రాముఖ్యతను భారత విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారని, రాబోయే 2+2 సమావేశం నేపథ్యంలో వీటి గురించి చర్చించారు' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 


భారత్‌, అమెరికా దేశాల మంత్రుల 2+2 ఐదవ సమావేశం దిల్లీలో జరుగుతుందని జైశంకర్‌ గురువారం ప్రకటించారు. అయితే సమావేశ తేదీలను ఆయన వెల్లడించలేదు. నవంబంరు ప్రథమార్థంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 


ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలో ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య జరిగింది.అయితే కెనడా పౌరుడైన నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వారి పార్లమెంటులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ కెనడా తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. తమకు విశ్వసనీయమైన సమాచారం ఉందని చెప్తోంది. కానీ దానిని బయటకు వెల్లడించడం లేదు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ కూడా కెనడా ఆరోపణలను తోసిపుచ్చారు. నిజ్జర్‌ హత్యకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిస్తే భారత్‌ దర్యాప్తుకు సహకరిస్తుందని జైశంకర్‌ హామీ ఇచ్చారు.