తెలుగు యువతి జాహ్నవి కందుల కేసులో తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా పోలీసులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. జాహ్నవిని ఉద్దేశించి హేళనగా మాట్లాడిన పోలీస్ డేనియల్ అడెరర్ ను సియాటెల్​నగర పోలీసు ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డేనియెల్ ఆడెరర్​ను ఆ విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు సియాటిల్ పోలీసు శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి నాన్-ఆపరేషనల్ పొజిషన్​ లో ఉంచినట్లు వెల్లడించింది. డేనియల్ ఆడెరర్ సియాటెల్​ పోలీసు ఆఫీసర్స్ గిల్డ్​ ఉపాధ్యక్షుడి పని చేస్తున్నాడు. ఇటీవల అతడి బాడీకామ్​లో రికార్డైన దృశ్యాలను సియాటిల్ పోలీసు శాఖ విడుదల చేసింది. జాహ్నవి మరణంపై మాట్లాడుతూ అతడు పగలబడి నవ్వడం అందులో రికార్డైంది. చనిపోయిన యువతి ప్రాణం విలువైనది కాదని డేనియల్ చెప్పడం సంచలనమైంది. డేనియల్ అడెరర్ వ్యవహారశైలిపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


100 అడుగులు దూరంలో ఎగిరి పడింది


జాహ్నవి కందుల రోడ్డు దాటుతుండగా కెవిన్‌ డేవ్‌ అనే అధికారి 911 పోలీస్‌ వాహనాన్ని అతివేగంతో నడిపి ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమె 100 అడుగులు ఎగిరి దూరంపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదం జరిగినప్పుడు కెవిన్ డేవ్ గంటకు 119 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సియాటెల్​ పోలీస్ డిపార్ట్‌మెంట్ నివేదికలో తెలిపింది. వాహనం ఢీకొనడానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. జాహ్నవిని ఢీకొట్టడానికి సెకను ముందు బ్రేకులు వేయడంతో, ఆ వేగం ధాటికి ఆమె 100 అడుగుల ముందుకు ఎగిరిపడింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వీధిలో వేగ పరిమితి గంటకు 25 మైళ్లు లేదా గంటకు 40 కి.మీ మాత్రమే.


ప్రమాదంపై ఏం మాట్లాడారు..
జాహ్నావిని ఉద్దేశించి, ఆమె చచ్చిపోయింది. ఓ మామూలు వ్యక్తేలే అంటూ గట్టిగా నవ్వుతూ మాట్లాడాడు. ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు, ఆమెకు 26 ఏళ్లు  ఉంటాయేమో, విలువ తక్కువేనంటూ హేళన చేశాడు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డయింది. దీన్ని సియాటెల్‌ పోలీసులు విడుదల చేశారు. దీనిపై  సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.  సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 
 
అమెరికాకు ఎప్పుడు వెళ్లింది
ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోని చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి, ఉన్నత విద్య కోసం 2021లో అమెరికాకు వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23న ఆమె అమెరికాలోని సియాటెల్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీకొట్టింది. కారు ఢీకొట్టగానే జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడింది. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనాస్థలికి వచ్చిన డేనియల్ ఆడెరర్ జాహ్నవి మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఘటన వివరాలను మరో అధికారికి తెలియజేస్తూ, నవ్వుకుంటూ మాట్లాడాడు. 'అవన్నీ అతడి శరీరానికి ఉన్న కెమెరాలో రికార్డయ్యాయి. అవి బయటకు రావడం వల్ల తీవ్ర వివాదం చెలరేగింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డేనియెల్ ఆడెరర్​ను ఆ విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు సియాటిల్ పోలీసు శాఖ ప్రకటించింది.