Infosys: వివిధ రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను ప్రోత్సహించడానికి క్రమం తప్పకుండా బోనస్‌లు, వివిధ రూపాల్లో నజరానాలు అందిస్తుంటాయి. కొన్నిసార్లు, కంపెనీ ఈక్విటీ షేర్లను కూడా ప్రోత్సాహకాల రూపంలో జారీ చేస్తాయి. మన దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఇదే చేసింది. అర్హులైన ఉద్యోగులకు 5.11 లక్షలకు పైగా కంపెనీ ఈక్విటీ షేర్లను కేటాయించింది. బోనస్‌ & ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద ఈ నెల 12వ తేదీన ఈ కేటాయింపులు జరిగాయి.         

  


ఉద్యోగులకు ఎన్ని షేర్లు జారీ చేసింది?
సంస్థ ఆశించిన స్థాయిలో, లేదా అంతకుమించి పని చేసిన ఉద్యోగులకు (Infosys employees) రివార్డ్‌ ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ భావించింది. దీంతోపాటు, కంపెనీలో ఉద్యోగుల యాజమాన్య హక్కులు కాస్త పెరగాలని కూడా ఇన్ఫోసిస్ కోరుకుంది. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత మరింత పెరుగుతుందని లెక్కలు వేసింది. రివార్డ్‌ కింద, 2023 మే 12వ తేదీన కొంతమంది ఉద్యోగులకు 5,11,862 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు మే 14న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ సమాచారం ఇచ్చింది.       


ఇది కూడా చదవండి: Latest Petrol-Diesel Price 15 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి                     


అర్హులైన ఉద్యోగులకు కేటాయించిన షేర్లలో 5,11,862 ఈక్విటీ షేర్లలో 1,04,335 షేర్లు 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద జారీ అయ్యాయి. ఇది కాకుండా, ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ 2019 (INFOSYS EXPANDED STOCK OWNERSHIP PROGRAM 2019) కింద మిగిలిన 4,07,527 ఈక్విటీ షేర్లను కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులకు అందించింది.        


షేర్లు ఇవ్వడం వల్ల కంపెనీకి లాభం ఏంటి?
2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఈక్విటీ షేర్లను జారీ చేయడం వెనుక ఉన్న లక్ష్యం.. ప్రతిభావంతులైన & ముఖ్యమైన ఉద్యోగులు వేరే సంస్థలకు వెళ్లిపోకుండా కంపెనీలోనే నిలుపుకోవడం. వారి పనితీరును మెరుగుపరచడానికి, వ్యక్తిగత పనితీరులో వృద్ధికి మాత్రమే కాకుండా కంపెనీ అభివృద్ధికి కూడా జత కలిపి ఈక్విటీ షేర్ల జారీని అనుసంధానం చేసింది. అంటే, ఎవరికి వాళ్లు పని చేస్తే సరిపోదు, ఒక బృందంగా పని చేసి సంస్థ ఓవరాల్‌ ఫలితాల్లో మెరుగుదల చూపగలిగితే ఈ షేర్లు దక్కుతాయి. కంపెనీ వృద్ధిలో కొంత భాగాన్ని 'ఉద్యోగుల యాజమాన్యం పెంపు' రూపంలో అందజేయడం వల్ల, కంపెనీలో ఉద్యోగులుగా కాకుండా యజమానులుగా భావించి కష్టపడతారు, సంస్థ ప్రయోజనాల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దీని వల్ల అంతిమంగా మంచి ప్రభావం కనిపిస్తుంది.         


ఇది కూడా చదవండి: Stocks Watch Today, 15 May 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ DMart, Adani Group