ISRO Chairman : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation - ISRO) చైర్మన్‌గా ఎస్ సోమనాథన్ (Somanathan) స్థానంలో వి. నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వి నారాయణన్ అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాల ప్రకారం, ప్రస్తుత ఇస్రో చీఫ్ గా వి నారాయణన్ జనవరి 14న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే రెండేళ్లు లేదా తదుపరి నోటుసు వచ్చే వరకు ఆయనే కొనసాగనున్నారు.
ప్రస్తుతం వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్న వి. నారాయణన్.. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి 4 దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలో ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఆపరేషన్‌లలో ఆయన విశేష కృషి చేశారు.
వి. నారాయణన్ గురించి
నారాయణన్ తమిళనాడులోని కన్యాకుమారులో జన్మించారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ ఫస్ట్ ర్యాంకు సాధించిన ఆయన.. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నారాయణన్ APEX స్కేల్ సైంటిస్ట్ మాత్రమే కాకుండా ఇస్రోలో అత్యంత సీనియర్ డైరెక్టర్ గానూ ఉన్నారు.
ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ సోమనాథన్ పదవీకాలం జనవరి 13తో పూర్తి కానుంది. ఈ క్రమయంలో ఇస్రోలోనే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (Liquid Propulsion Systems Center) డైరెక్టర్ వి నారాయణన్‌ను కొత్త ఛీఫ్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇస్రోలో సోమనాథన్ తర్వాత సీనియర్ డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి కూడా నారాయణన్ నే కావడం చెప్పుకోదగిన విషయం. అంతేకాదు శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అందులో ఉపయోగించే కెమికల్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజనిక్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, క్రయోజనిక్ ప్రొపల్షన్ దశల్ని కూడా ఆయనే పర్యవేక్షిస్తుంటారు.
ప్రస్తుతమున్న ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలోనే చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో రోవర్(Rover)ను ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాదు అమెరికా, రష్యా. చైనా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల సరసన భారత్ చేరింది.