Israel Gaza War: ఇజ్రాయేల్ హమాస్ మధ్య జరుగుతున్న (Israel Hamas War) యుద్ధం మరో స్థాయికి చేరుకునేలా ఉంది. ఇప్పటికే అటు ఇరాక్‌తో పోరాటం చేస్తున్న ఇజ్రాయేల్ ఇప్పుడు మళ్లీ గురిని హమాస్‌పై పెట్టింది. గాజాలోని రఫా సిటీలో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. యుద్ధాన్ని మరింత తీవ్రం చేయబోతున్నామంటూ ఇజ్రాయేల్ చేసిన ప్రకటనతో అటు ఈజిప్ట్ కూడా ఉలిక్కిపడింది. ఇజ్రాయేల్‌ని తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఇజ్రాయేల్ మాత్రం వెనక్కి తగ్గేలా (Attack on Rafah) కనిపించడం లేదు. రఫాలోని పౌరులకు పునరావాసం కల్పించేందుకు 40 వేల టెంట్‌లు సిద్ధం చేసింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ని అంతం చేస్తామని తేల్చి చెప్పారు. ఇక్కడే ఎక్కువ మంది హమాస్ ఉగ్రవాదులున్నారని భావిస్తోంది ఇజ్రాయేల్. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసిన తరవాత ఇజ్రాయేల్‌ రఫా ప్రాంతంపైనే ఎదురు దాడులకి దిగింది. వేలాది మంది ఉగ్రవాదులు ఇక్కడే నక్కి ఉన్నారని గుర్తించింది. ఇప్పుడు మరింత తీవ్రంగా దాడులు తప్పవని హెచ్చరించడం కీలకంగా మారింది. అయితే...ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతా అల్ సిసి (Abdel-Fattah Al-Sisi) ఇజ్రాయేల్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రఫాలో మిలిటరీ ఆపరేషన్స్ చేపడితే అందుకు తగ్గ పరిణామాలు చూస్తారని తేల్చి చెప్పారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. 


ఈజిప్ట్ వార్నింగ్..


ఈజిప్ట్ సరిహద్దుకి సమీపంలో ఉన్న Rafah ప్రాంతంలో అలజడి నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం మొదలైన తరవాత లక్షలాది మంది పాలస్థీనా ప్రజలు ఈజిప్ట్‌కి వలస వెళ్లారు. ఇటు ఇజ్రాయేల్ తీరుని అమెరికా కూడా గమనిస్తోంది. రఫాపై దాడులను ఉపసంహరించుకోవాలని సూచిస్తోంది. హమాస్‌తో పోరాటం చేసేందుకు వేరే విధానాన్ని ఎంచుకోవాలని చెబుతోంది. కానీ ఇజ్రాయేల్ అమెరికా హితబోధను పట్టించుకునే పరిస్థితిలో లేదు. గాజా నుంచి కొంత వరకూ బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఇజ్రాయేల్‌ ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడు రఫాపై దాడులకు సిద్ధమవడం ద్వారా యుద్ధ తీవ్రత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పరిస్థితులు చేయి దాటక ముందే ఏదోటి చేయాలని అమెరికాతో పాటు ఈజిప్ట్, ఖతార్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాల్పుల విరమణ  ఒప్పందం కుదర్చాలని చూస్తున్నాయి. ఇజ్రాయేల్ మిలిటరీ దాడుల్లో ఇప్పటి వరకూ 34 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా అధికారులు చెబుతున్నారు. 


అటు ఇరాక్, ఇజ్రాయేల్ మధ్యా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాక్‌లోని ఎంబసీపై ఇజ్రాయేల్ దాడి చేసిన తరవాత ఒక్కసారిగా రెండు దేశాల మధ్య వైరం భగ్గుమంది. ప్రతీకార దాడులకు దిగాయి. ఈ విషయంలోనూ అమెరికా ఇజ్రాయేల్‌కే మద్దతునిస్తోంది. భారత్‌ కూడా ఈ యుద్ధంపై స్పందించింది. వీలైనంత త్వరగా రెండు దేశాలూ ఉద్రిక్తతలను తగ్గించే విధంగా చర్చలు జరపాలని సూచించింది. ఇజ్రాయేల్‌లోని భారతీయులకూ సూచనలు చేసింది. జాగ్రత్తగా ఉండాలని కోరింది. అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. 


Also Read: దేశ రాజకీయాల్ని వేడెక్కించిన ఈ శ్యాం పిట్రోడా ఎవరు? కాంగ్రెస్‌కి తలనొప్పిగా తయారయ్యారా?