Middle East War: ఇజ్రాయెల్‌- లెబనాన్‌లోని హెజ్బుల్లా మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బుల్లా దళాలు.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని వివిధ ప్రాంతాలు సహా లెబనాన్ రాజధాని బైరూట్‌పై ఇజ్రాయెల్ సేనలు ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా రెండు రోజుల వ్యవధిలో లెబనాన్‌లో 492 మందికిపైగా మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారులు మహిళలు, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని లె బనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.






లెబనాన్‌, గాజా స్ట్రిప్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు:


సోమవారం నుంచి దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులు చేస్తోంది. దాడుల్లో మృత్యువాత పడ్డ 492 మందిలో 35 మంది చిన్నారులు ఉన్నారని లెబనాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 16 వందల మందికిపైగా పౌరులు గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో అపరిమిత యుద్ధం అంటూ హెజ్బొల్లా సేనలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తర ఇజ్రాయెల్‌పై ఆదివారం నుంచి రాకెట్ లాంచర్లతో బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడిలో లెబనాన్ చిగురుటాకులా వణుకుతోంది.


ఇదే టైంలో గాజా స్ట్రిప్‌లోనూ ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. గడచిన 24 గంటల్లో 24 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకుందని మరో 60 మందిని గాయపరిచిందని గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకూ గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో దాదాపు 41 వేల 431మంది మృత్యువాతపడ్డారు. మరో 96 వేల మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.


2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన అటాక్‌లో 11 వందల 39 మంది చనిపోగా మరో 200 మంది బందీలుగా చిక్కారు. వీరిలో చాలా మందిని చంపేశారు. దీంతో ఈ సంఖ్య 1400కి చేరింది. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌.. మధ్యప్రాశ్చ్యంలో మారణహోమం సృష్టిస్తోంది. ప్రస్తుతం లెబనాన్‌లోని బెక్కా లోయ సహా బైరూట్‌లో దాడులు చేస్తోంది. హెజ్బొల్లా ఆయుధాలు దాచి ఉంచిన 13 వందలకుపైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.


దాడులు జరుగుతున్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ సూచించారు. హెజ్‌బొల్లా దళాలకు సామాన్యులు మానవ కవచాలుగా మారితే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సామాన్య పౌరులతో తమకు శత్రుత్వం లేదని హెజ్‌బొల్లా ఉగ్రసంస్థపైనే దాడులు చేస్తున్నామని నెతన్యూహూ తేల్చి చెప్పారు. లెబనాన్ వ్యాప్తంగా 650 దాడులు చేసి 13వందలకిపైగా హెజ్బొల్లా టార్గెట్స్‌ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.


మధ్యప్రాశ్చ్యంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్న వేళ.. సిచ్యువేషన్స్‌ అదుపులో ఉంచేందుకు యూఎస్‌ తమ సైన్యాన్ని అక్కడకు పంపుతున్నట్లు పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది.






వారం క్రితం(సెప్టెంబ్‌ 18)న పేజర్‌ పేలుళ్లు, వాకీటాకీల విధ్వంసాలతో ఆ వారంలో 32 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఆ ఘటనల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారగా.. ఇప్పుడు అది భీకర యుద్ధంగా పరిణమించింది. మధ్యప్రాశ్చ్యం కన్ఫ్లిక్ట్‌ పెద్దది కావాలని  ఇజ్రాయెల్ కోరుకుటోందని ఇరాన్ ధ్వజమెత్తగా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని.. ఐక్యరాజ్యసమితి సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని హితవు పలికింది.


ఇరుపక్షాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా కూడా సూచించింది. 2006 తర్వాత ఆ స్థాయిలో లెబనాన్‌లోని ఇరాన్ మద్దతుతో నడిచే హెజ్‌బొల్లా.. ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇజ్రాయెల్ హమాస్‌ మధ్య గతేడాది అక్టోబర్‌ నుంచి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇందులో జోక్యం చేసుకున్న హెజ్‌బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాదాపు 9 వేలకుపైగా రాకెట్ లాంచర్ల దాడులు చేసింది. ఒక్క సోమవారమే 250కి పైగా రాకెట్ లాంచర్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు చాలా వరకు అడ్డుకున్నాయి. గాజా యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్న తర్వాత.. తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిన ఇజ్రాయెల్‌.. భీకర దాడులు చేస్తోంది.


Also Read: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు లక్ష మందికిపైగా వలసలు